Friday, November 22, 2024

పొంగులేటి శిబిరంలో అలజడి.. !.. బీఆర్ఎస్ లోనే ఆకుల మూర్తి

ఖమ్మం : ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శిబిరంలో అలజడి లేచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఆయన అనుచరులు ఒక్కొక్కరు ఆయన నిర్ణయాలను విభేదిస్తూ బయటికి వెళ్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ముందే ఆయన శిబిరాన్ని వీడి మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీలో సత్తుపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్ మట్టా దయానంద్ చేరగా, తాజాగా పొంగులేటి ప్రధాన అనుచరుడిగా మొదటి నుండి ఆయన వెంటే కొనసాగుతున్న ఆకుల మూర్తి పొంగులేటిని విభేదించడం విశేషం. 2014 ఎన్నికల్లో పొంగులేటి ఎంపీ కాకముందు నుంచే ఆయన అనుచరుడిగా ఆకుల మూర్తి కొనసాగుతున్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఆకుల మూర్తి స్పష్టం చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో బుధవారం ఆకుల మూర్తి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారధ్యంలో మంత్రి కేటీఆర్ తో భేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నా పయనం బీఆర్ఎస్ తోటే అని ఆకుల మూర్తి పేర్కొన్నారు. కేటీఆర్ పై పొంగులేటి చేసిన వ్యాఖ్యలు తమకు నచ్చలేదని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని విషయాలు మీడియా ముందు వెళ్లడిస్తానని స్పష్టం చేశారు. ఆకుల మూర్తితో పాటు మొదటి నుంచి ఆయన వెంట కొనసాగుతున్న మరికొందరు త్వరలో ఆయన శిబిరాన్ని వీడనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement