బోథ్, ఆగస్టు 29, ప్రభ న్యూస్ : ఆదిలాబాద్ జిల్లాలోని పురాతన నియోజకవర్గ కేంద్రమైన బోథ్ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని, తరలిపోయిన ప్రభుత్వ కార్యాలయాలను వెనక్కి రప్పించాలని, ఫైర్ స్టేషన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తదితర 31 డిమాండ్లతో రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. గత 45 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ రైతులందరూ కలిసి ఎడ్లబండతో నిర్వహించిన ర్యాలీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించింది.
ఈ సందర్భంగా రైతన్నలు మాట్లాడుతూ.. బోథ్ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే ఒక్కరు కూడా ఓటు వేయరని, అవసరమైతే ఎలక్షన్లను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో రెవిన్యూ డివిజన్లను ప్రకటించారని, అలాగే బోథ్ ను కూడా రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 45 రోజులుగా మండలంలోని 36 గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి మరి ఉద్యమంలో పాల్గొంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని తీవ్రంగా విమర్శలు చేశారు.
రెవిన్యూ డివిజన్ ఉద్యమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సంఘీభావం తెలిపాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే బోథ్ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరారు. లేకపోతే ఉద్యమం మరింత తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు.