హైదరాబాద్: ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించాలని గవర్నర్ తమిళిసైని కోరామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అన్నారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా నిలిపివేసిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు రాజ్‌భవన్ ముట్టడించారు. ఈ సందర్భంగా కార్మికులతో గవర్నర్ భేటీ అయ్యారు. గంటకుపైగా కార్మిక సంఘాల నాయకులతో చర్చించారు. భేటీ అనంతరం టీఎంయూ నేత థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని గవర్నర్ తమతో అన్నారని చెప్పారు.
కార్మికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారన్నారు. ప్రభుత్వ వివరణ తర్వాత బిల్లు ఆమోదిస్తానని తెలిపారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నామని చెప్పారు. గవర్నర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు