Saturday, November 23, 2024

గుర్తింపు లేని కాలేజీల్లో అడ్మిష‌న్లు.. విద్యార్థులు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం..

హైదరాబాద్‌,(ప్ర‌భ‌న్యూస్):రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువు ఈ నెల 12తో ముగిసింది. అయితే కొన్ని ప్రైవేట్‌ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు నుంచి అఫిలియేషన్‌ (గుర్తింపు) లేకున్నా కానీ అడ్మిషన్ల ప్రక్రియను యథేచ్ఛగా ముగించేశాయి. అటు ఇంటర్‌ బోర్డు.. ఇటు ప్రైవేట్‌ కాలేజీల అలసత్వం కారణంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం లేకపోలేదు.

గుర్తింపుల్లేని కాలేజీల్లోనూ విద్యా ర్థులు తెలియక అడ్మిషన్లు పొందారు. 2021-22 విద్యాసంవత్సరానికి గానూ రాష్ట్రంలోని 1586 కాలేజీలు ఇంటర్‌ బోర్డుకు గుర్తింపు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఈనెల 12 నాటికి 1269 కాలేజీలకు మాత్రమే గుర్తింపునిచ్చారు. మిగిలిన 317 కాలేజీలకు ఇంటర్‌ బోర్డు నుంచి గుర్తింపు ఇవ్వలేదు. కాలేజీలకు గుర్తింపు లేకున్నప్పటికీ గుర్తింపు ఉన్న కాలేజీలతో పాటు, లేని కాలేజీల్లోనూ ఇంటర్‌ మొదటి సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకున్నట్లు సమాచారం.

కళాశాలలకు గుర్తింపు లేని విషయం తెలియక చాలా మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో ఇప్పటికే అడ్మిషన్లు పొందారు. అటు అడ్మిషన్ల ప్రక్రియ గడువు కూడా ఈనెల 12తో ముగిసింది. ఇప్పికే ఈ గడువును దాదాపు 11 సార్లు పెంచారు. అయినా ఇంత వరకూ ఈ కాలేజీల గుర్తింపు విషయంలో అటు అధికారులు, ఇటు కాలేజీల యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గుర్తింపు లేకుంటే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement