హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీచర్ల సర్దుబాటు ప్రక్రియపై విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీస్థాయిలో సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు పెరగడంతో ఆయా పాఠశాలలకు అవసరం మేరకు టీచర్లను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈక్రమంలోనే జిల్లా విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే జిల్లాల్లో సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను గుర్తించి అక్కడ అదనపు టీచర్లను కేటాయిస్తున్నారు. పిల్లలున్న పాఠశాలల్లోనే టీచర్లు ఉండేలా, అవసరం మేరకు అదనపు టీచర్లను కేటాయిస్తున్నారు. విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉండి టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉండే పాఠశాలల నుంచి కొంత మంది టీచర్లను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. బుధవారం డీఈవోలతో జరిగిన జూమ్ మీటింగ్‌లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే టీచర్లకు వర్క్‌అడ్జస్ట్‌మెంట్ చేయాలని ఎంఈవోలకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. విద్యార్థులు, టీచర్ల సంఖ్యను బట్టి టీచర్ల సర్దుబాటు ప్రక్రియను చేపడుతున్నారు. ఈమేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా డీఈవో..ఎంఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. చాలా స్కూళ్లల్లో టీచర్ల కొరతతో పాటు సబ్జెక్టు టీచర్ల కొరత కూడా ఉంది. అయితే ప్రస్తుతం సర్దుబాటు చేసిన తర్వాత ఇంకా టీచర్లు కొరత ఉంటే ఆయా స్థానాల్లో విద్యావాలంటీర్లను విధుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం.
సర్దుబాటుతో న్యాయం జరిగేనా?…
టీచర్ల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్లనైనా తీసుకోవాలి లేదంటే శాశ్వత నియామకాలైనా చేపట్టాలని విద్యా వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఏదీ చేయకుండా సర్దుబాటు పేరుతో విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెరిగిదింది. ఉపాధ్యాయుల కొరతను అధిగమించడంలో ప్రతీ ఏటా ప్రభుత్వం సర్దుబాటు చేస్తూ నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తుందని టీవీవీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శివానందర స్వామి ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.