హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎయిడెడ్ కాలేజీల్లోని లెక్చరర్లను, సిబ్బందిని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సర్దుబాటు చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సరిపడా లెక్చరర్లు, సిబ్బంది లేనిచోట ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో ఉన్న మిగులు సిబ్బందిని ఆదిశగా సర్దుబాటు చేస్తున్నారు. ఈమేరకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేసే ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టు భోదించే లెక్చరర్లతో పాటు సీనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, టైపిస్టు, ఆఫీస్ సబార్డినేట్ ఇతర సిబ్బందిని జిల్లాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రంలోని పలు జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు, సిబ్బంది కొరత ఉంది. ఇటీవల కొన్ని చోట్ల కొత్త కాలేజీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అక్కడ సిబ్బందిని నియమించాల్సి ఉంది. పైగా విద్యార్థులు ఎవరూ చేరని కారణంగా రాష్ట్రంలో పలు ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు మూతపడ్డాయి. మరికొన్ని కాలేజీల్లో విద్యార్థులు చేరకపోవడంతో అడ్మిషన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి సిబ్బంది ఎక్కువగా ఉన్న ఎయిడెడ్ కాలేజీలను ఇంటర్ విద్యాశాఖ గుర్తించి అందులో పనిచేసే లెక్చరర్లు, సిబ్బందిని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అవసరమయ్యే చోట కేటాయించారు. ఈ రకంగా 63 మంది స్టాఫ్‌ను వివిధ జిల్లాల్లోని జూనియర్ కాలేజీలకు కేటాయించారు. వీరిని త్వరగా రిలీవ్ చేసి కొత్తగా నియమించిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.