బోథ్, సెప్టెంబర్ 6 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పెద్దవాగు శివారులో బట్టలు ఉతకడానికి వెళ్లిన రజక మహిళ వోడ్నాల పోసాని(50) ప్రమాదవశాత్తు వాగులో మునిగిపోయి చనిపోయింది. స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్, బంధువులు రజకుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే డోభీ ఘాట్ లేకపోవడం వల్లె ప్రమాద వశాత్తు మహిళా చనిపోయిందని వెంటనే ధోబి ఘాటు నిర్మించాలని రజకులు ఆందోళనకు దిగారు.
గతంలో పలు సంఘటనలు జరిగినప్పటికీ అధికారులు, నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు శవాన్ని కదిలించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. రజకులతో ఆయన మాట్లాడుతూ.. వెంటనే ధోబీ ఘాట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, అలాగే బట్టలుతికే రజకులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రజకులు ఆందోళన విరమించారు. తక్షణ సహాయం కింద ఎమ్మెల్యే అనిల్ మృతురాలు కుమారునికి రూ.10,000 అందించారు.