- ఏజెన్సీలో గిరిజనేతరుల సమస్యలను పట్టించుకోండి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్..
- పట్టణ ప్రాంతాల్లో భూమిలేని కూలీలకు న్యాయం చేయండి : పాయల్ శంకర్
- ఉమ్మడి జిల్లా ప్రణాళిక సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజర్
ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాబివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. నాలుగు సంక్షేమ పథకాలను పకడ్బందీగా, పారదర్శకంగా ఈనెల 26 నుండి అమలు చేస్తామన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధి – ప్రణాళిక- కార్యాచరణ సమావేశం జరిగింది.
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… రేషన్ కార్డు లేని పేదలందరికీ ఆహార భద్రత కార్డులు అందిస్తున్నామని, భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతలుగా రూ.12 వేలు అందిస్తున్నట్టు తెలిపారు. గ్రామస్థాయిలో జాబితాలను ప్రదర్శించి, పేదలకు పథకాలు అందిస్తామని, అభివృద్ధిలో రాజకీయాలు ఉండే ప్రసక్తే లేదన్నారు.
ఏజెన్సీలో గిరిజనేతరులకు ఇండ్లు మంజూరు చేయండి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో గిరిజనేతరులకు సాగు చేస్తున్న భూములకు రైతుబంధు పథకంతో పాటు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు నిర్మించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలను కలిపి రేషన్ కార్డులు ఇచ్చారని, ఇప్పుడు పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలుగా విడిపోయినందున వారందరికీ రేషన్ కార్డులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వర్షాకాలంలో బోథ్ నియోజవర్గ పరిస్థితి దయనీయంగా ఉంటుందని, రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు.
పట్టణ ప్రాంతాల్లో కూలీలను పట్టించుకోండి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయడం పట్ల ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. అయితే పట్టణ ప్రాంతాల్లో కూలీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ఇండ్ల స్థలాలు లేని పేదల గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. రాజకీయ జోక్యం ఉంటే పేదలకు న్యాయం జరగదని మంత్రి సీతక్క అన్నారు. గ్రామస్థాయిలో ఇప్పటికే రాజకీయాలు మొదలయ్యాయని ఈ విషయంలో పారదర్శకత పాటించాలని సూచించారు. ఎమ్మెల్యేలు రామారావు పటేల్, మహేశ్వర్ రెడ్డి, వెడమ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విట్టల్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్ తో పాటు సిర్పూర్ టి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు హాజరుకాలేదు.