జన్నారం, నవంబర్ 26 (ఆంధ్రప్రభ) : రైతు మద్దతు ధర నిర్ణయించే చట్టం కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి.చంద్రకుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడలో తెలంగాణ రైతు సంక్షేమ సమితి మండలాధ్యక్షుడు అల్లం లచ్చన్న ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ… మిగతా వ్యాపార రంగంలో ఉత్పత్తిదారునికి ధర నిర్ణయించుకునే హక్కు ఎలా ఉందో వ్యవసాయ రంగంలోనూ రైతుకు ధర నిర్ణయించుకునే హక్కు కల్పించాలన్నారు. గతంలోని డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు కనీస మద్దతు ధర చట్టం అమలు చేయాలని ఆయన కోరారు. ఆ హక్కు సాధన కోసం రైతులు పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. రైతు లేనిదే రాజ్యం లేదంటూ రైతుల ఓట్లతో గెలిచే నేతలు అధికారంలోకి వచ్చాక రైతులను విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు.
రైతులంతా ఐక్యంగా ఉండి రైతుల హక్కుల కోసం పోరాడవలసిందిగా ఆయన సూచించారు. అందుకోసం తన సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని, రైతుల పక్షాన రైతుల సంక్షేమం కోసం ఎన్ని ఉద్యమాలకైనా తాను సిద్ధమన్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డిసెంబర్ 1న నిర్వహించే 5వ వార్షికోత్సవ రైతు సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుంచి రైతులు తరలివచ్చి, విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సదస్సులో రైతు సంక్షేమ సమితి నేతలు ఏనుగు సుభాష్ రెడ్డి, బి.ప్రభుదాస్, నరసింహులు అశోక్, బుచ్చన్న, మామిడి విజయ్, గంగాధర్, అల్లం పెద్దన్న, సహదేవ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.