బెజ్జూర్, (ప్రభ న్యూస్) : కొమురం భీం ఆసిఫా జిల్లా సిర్పూర్ నియోజకవర్గం లోని బెజ్జూరు మండలంలోని నాగె పెళ్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి కొడుప మల్లు బాయ్ కి ఉదయం పురిటి నొప్పులు రాగా ఆశా వర్కర్ దుర్గు బాయ్ సహాయంతో ఆటోలో బెజ్జూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళుతున్న తరుణంలో ఒర్రె ఉప్పొంగి ప్రవహించడంతో తిరిగి గూడెం వైపు వెళ్లారు. కోయపల్లి సమీపంలో రోడ్డు కల్వర్టు వద్ద రోడ్డు కోతకు గురి కావడంతో ఆటో కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ కల్వర్టు వద్ద రోడ్డుపైనే ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బెజ్జూరు నుండి సోమినీ మీదుగా నాగపల్లి వెళ్లేందుకు రోడ్డు రవాణా సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో 108 వాహనం గూడెం మీదుగా కోయపల్లి గ్రామ సమీపానికి చేరుకుని ఈఎంటి జి .మల్లేష్ తల్లి బిడ్డను పరిశీలించి, పైలెట్ శ్రవణ్ 108 లో బెజ్జూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలు అయినటువంటి మొగవెల్లి, సోమిని, నాగ పెళ్లి ,గిర్రగూడ, సుష్మీర్ ,ఇప్పలగూడ బండ్లగూడ తదితర గిరిజన గ్రామాలకు వర్షాకాలంలో అత్యవసర సమయంలో రోడ్డు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రతి ఏడాది ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అవుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు తమను పట్టించుకోవడం లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతిని అధికారులు స్పందించి అత్యవసర సమయంలో మెరుగైన ప్రభుత్వ వైద్యం అందెలా రోడ్డు రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.