Friday, September 20, 2024

ADB | మంచిర్యాలలో పులి సంచారం.. ప్రజల్లో భయం భయం..

జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న జువ్విగూడకు చెందిన ఆడే మోహన్ అనే వ్యక్తి ఆవు, దూడపై ఈ నెల 21న పులి దాడి చేసి గాయపరిచింది. గమనించిన‌ యజమాని మోహన్ వెంటనే అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.

కాగా, పులి జాడ కోసం సీసీ కెమెరాలు, యానిమల్ ట్రాకర్లు, బేస్ క్యాంపు సిబ్బంది, అటవీశాఖ అధికారులు, హెచ్ టీసీఎస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు విస్తృతంగా వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం నాడు పులి దాడి చేసిన ఆవు, దూడను ప్రభ న్యూస్ రహస్యంగా చిత్రీకరించింది.

అయితే, పులిని ఇక్కడే ఉంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు మంచిర్యాల డీఎఫ్‌వో శివ ఆశిష్‌సింగ్‌ ఆధ్వర్యంలో అటవీశాఖకు చెందిన యానిమల్‌ ట్రాకర్లు, తాళ్లపేట రేంజ్‌ అధికారి సుష్మారావు, ఇతర అధికారులు పులి పాదముద్రలను స్పష్టంగా గుర్తించారు. పులి దాదాపు మూడున్నర సంవత్సరాల వయస్సు గల మగ పులిగా భావిస్తున్నారు.

అధికారులంతా అడవులకు సమీపంలోని గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలు, గొర్రెల కాపరులు అడవుల్లోకి వెళ్లొద్దని ప్రచారం చేశారు. వారం రోజుల క్రితం కొమరం కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా తిర్యాణి, గుండాల అడవుల్లో సంచరించిన పెద్దపులి.. ఈ పులి ఒక్కటేనని పాదముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement