Tuesday, November 26, 2024

తెలంగాణ నీటి ప్రయోజనాలను వదులుకునే ప్రసక్తే లేదు.. కృష్ణాలో 50:50 నీళ్లు ఇవ్వాల్సిందే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొత్త నీటి సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నదుల్లో రావాల్సిన నీటి కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకో బోమని, ఆ దిశగా కేంద్ర జలశక్తిశాఖపై ఒత్తిడి తేవాలని ఉన్నతాధికారులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. జూన్‌ 1 నుంచి ఈ ఏడాది 2022-23 సంవత్సర నీటి ఏడాది ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి కృష్ణా నదీలో ఇప్పుడున్న 66:34 రేషియోలో నీటి పంపిణీ ఆమోదయోగ్యం కాదని, 50:50 శాతం ప్రాతిపదికన పంచాల్సిందేనని ఉన్నతాధి కారులతో ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం గోదావరి, కృష్ణా నదీ జలాల వ్యవహారాలు చూసే ఉన్నతాధికారులతో జలసౌధలో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కృష్ణా జలాలు 66:34 నిష్పత్తిలో పంపిణీ తాత్కాలికంగా జరిగిన ఒప్పందమేనని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.

కాని కేఆర్‌ఎంబీ ఇప్పుడు అదే ప్రాతిపదికన ప్రతి ఏటా నీటి కేటాయింపులు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేఆర్‌ఎంబీ దృష్టికి తెచ్చామని, త్వరలో కేంద్ర జలశక్తి శాఖ, జాతీయ జల వనరుల సంస్థ దృష్టికి కూడా తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇటీవల నిర్వహించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం లో చర్చించిన అంశాలపై విడుదలైన మినిట్స్‌ పైనా అంతర్గత సమావేశంలో రజత్‌ కుమార్‌ ఉన్న తాధికారులతో కీలకంగా చర్చించినట్లు తెలిసింది. శ్రీశైలం నుంచి జలవిద్యుత్పత్తి విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ఆ మేరకు విద్యుదుత్పత్తిని చేసి తీరాలని రజత్‌ కుమార్‌ ఆదేశించినట్లు సమాచారం. కాగా… కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేకంగా నిర్వహించిన నదీ జలాశయాల పర్యవేక్షణా కమిటీ సమావెశం జరుగుతున్న సమయంలోనే తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ అంతర్గత సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement