ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ… కాంగ్రెస్ లో అసమ్మతి గ్రూపుల గొడవ ఆదిలాబాద్ జిల్లాలో దుమారం రేపుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవరెడ్డిపై హై కమాండ్ సస్పెన్షన్ వేటు ఎత్తివేయగా.. వీరంతా గాంధీ భవన్ లో ఘర్ వాపసి పేరుతో కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుకున్నారు. ఆరేళ్ల పాటు విధించిన సస్పెన్షన్ వేటును ఐదు నెలలకే ఎత్తివేయడంపై ప్రత్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి వర్గo అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మంగళవారం రాత్రి సుజాత సాహిద్ ఖాన్ సంజీవరెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలుపగా, బుధవారం మధ్యాహ్నం తిరుగుబాటు నేతలను పార్టీలో చేర్చుకోవద్దని, సస్పెన్షన్ వేటు యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా భవన్ కార్యాలయ ప్రాంగణంలో నిరసన దీక్ష చేపట్టారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజాత, సాజిద్ ఖాన్ వర్గంతో కలిసి పని చేయబోమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆలోచించి వారిపై సస్పెన్షన్ వేటు యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కంది శ్రీనివాస్ రెడ్డి వర్గ నేతలు తుమ్మల వెంకట్ రెడ్డి, గిమ్మే సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, లోక ప్రవీణ్ రెడ్డి, మంచికట్ల ఆశమ్మ, బూర్ల శంకరయ్య, రషీద్, అనుముల ఉషన్న, ముక్కెర సంతోష్, రాజలింగు, ఖయ్యూం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ఆదిలాబాద్ టౌన్టౌన్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి మాత్రం నిరసనలకు దూరంగా ఉన్నారు.