తాంసి (ప్రభ న్యూస్) : దశాబ్ది ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ జొన్న పంట కొనుగోలుపై లేదా అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం తాంసి మండల కేంద్రం సమీపంలోని మార్క్ఫెడ్ ఎదుట రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన జొన్నలను గత వారం రోజుల నుండి గన్ని బ్యాగుల పేరిట, గోదాముల పేరిట, లారీల పేరిట కొనుగోలు నిలిపివేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తాంసి పోలీసులు రాస్తారోకోను అడ్డుకోగా మరో రెండు రోజుల్లో జొన్న కొనుగోలు ప్రారంభించకపోతే రైతులతో కలిసి రోడ్డు పై వంటావార్పు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సతీష్ రెడ్డి, మండల అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముక్కెర సుభాష్, మండల ఉపాధ్యక్షులు సిరిగిరి మహేందర్, పెంట గంగాధర్, తుకారాం, సతీష్, స్వామి, రైతులు పాల్గొన్నారు.