Wednesday, November 13, 2024

TG … ఉట్నూరు ఏజెన్సీలో టెన్ష‌న్‌ … టెన్ష‌న్‌ … ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్

జైనూరులో త‌గ్గ‌ని ఉద్రిక్త‌త‌..
1200 మంది పోలీసులు ప‌హారా
రంగంలో రాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్‌
ఆదిలాబాద్‌-కొమురం భీం జిల్లాకు నిలిచిన రాక‌పోక‌లు
ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిపివేత‌
మీడియాపై ఆంక్ష‌లు

ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ బ్యూరో : ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా జైనూరులో ఇరు వర్గాల మ‌ధ్య జ‌రిగిన‌ ఘర్షణలు, విధ్వంసకాండ నేపథ్యంలో ఉత్కంఠ నెల‌కొంది. ఓ మహిళపై లైంగిక దాడి, హతాయత్నానికి నిరసనగా జైనుర్ బంద్ ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ ఘటనలో 70 కి పైగా దుకాణాలు, రెండు కార్లు, రెండు ఆటోలు, 8 మోటర్ బైకులు కాలి బూడిదయ్యాయి. పలు దుకాణాలకు నిప్పు పెట్టడంతో గురువారం వరకు మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది.

- Advertisement -

ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్‌
ఆసిఫాబాద్ జిల్లాలో జ‌రుగుతున్న ప‌రిణామాలు వ‌క్రీక‌రించి సోష‌ల్ మీడియాలో ట్రోల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఇంట‌ర్నేట్ సేవ‌ల‌ను పోలీసులు బంద్ చేశారు. బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌ బాoడ్ తోపాటు అన్ని ప్రైవేటు కంపెనీల‌కు చెందిన నెట్‌ సేవలు నిలిచిపోయాయి.

జైనూరులో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తిష్ఠ‌
అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ జైనూరులో గురువారం తిష్ఠ వేసి శాంతిభ‌ద్ర‌త‌ల‌ను అదుపు లోకి తీసుకురావ‌డానికి ప‌ర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ రేంజ్ డీఐజీ చంద్రశేఖర్, నలుగురు ఎస్పీలు, ఎనిమిది మంది డిఎస్పీలు, ఇద్దరు సీపీలు బందోబ‌స్తు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మ‌ల్ , మంచిర్యాల జిల్లాలకు చెందిన 1200 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. హస్నాపూర్, నార్నూర్, జంగావ్, సిర్పూర్ యు, నాలుగు కూడళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే చ‌ర్య‌లు
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో బాధితురాలికి సత్వర న్యాయం చేసే విధంగా తమ వంతు కృషి చేస్తామని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఉట్నూర్, జై నూర్, సిరిపూర్ యూ, కెరమెరి, ఆస్వాబాద్ నార్నూర్, గాదిగూడ మండలాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. మహిళా పోలీసులతో కూడిన రాపిడ్ యాక్షన్ బలగాలు జైనూర్ ఏజెన్సీలో బందోబస్తు నిర్వహిస్తున్నాయి.

ఇద్దరు ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్..
జై నూర్ మండల కేంద్రానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, సిర్పూర్ టి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు లను ముందస్తుగా పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. వీహెచ్పి బీజేవైఎం నాయకులను అదిలాబాదులో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు.

రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేయొద్దు
ప్ర‌తి ఒక్క‌రూ సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం విజ్ఞ‌ప్తి చేశారు. మీడియాకు ఆంక్షలు విధించడం, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జ‌ర్న‌లిస్టులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement