Friday, November 22, 2024

ఆ జిల్లాలో ఇనాం భూముల‌న్నీ హాంఫ‌ట్ చేస్తున్నార‌ట‌!

నాడు దేవాలయాల అభివృద్ధిపై ఆధారపడిన వారి జీవనోపాధికి సంబంధిత ఆలయభూములను పురోహితులకు, సంబంధికులకు సర్వీస్‌ ఇనాం భూములుగా రికార్డులో చేర్చేవారు. అలా బహుమతిగా వచ్చిన భూములే నేడు ఉమ్మడి జిల్లాలో అక్రమ వెంచర్లుగా వెలసి రూ. వందల కోట్ల వ్యాపారానికి అడ్డాగా మారుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాదాయ, ధర్మాదాయ శాఖ భూములను పరిరక్షించడం కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో తమ పేర ఉన్న సర్వీస్‌ ఇనాం భూములను వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు. నవాబ్‌ పేట మండల కేంద్రంలోని సర్వే నెంబర్లు 776,777లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన 8.71ఎకరాల భూమి ఉన్నట్లుగా సంబంధిత శాఖ రికార్డులు చూపుతున్నాయి. ఆ భూములు నాటి నుంచి సంబంధిత ఇనాందారు.. అక్రమంగా ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్మడంతో సుమారుగా 80 శాతానికి పైగా సంబంధిత భూమిలో నేడు బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయని స్థానికులు వాపోతున్నారు. దవాదాయ శాఖ భూములు , అక్రమంగా ఏర్పాటు చేసిన ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదు.
కాని.. ఇనాం భూముల్లో ఇంటి నిర్మాణాల అనుమతులు రావడంపై పెద్ద ధుమారం చెలరేగింది. ఈ భూమిలో సర్వే నెం.776 లో 4.32 ఎకరాలు, 777లో 4.39 ఎకరాల భూమి ఉన్నట్లుగా దేవాదాయ శాఖ రికార్డుల్లో రుజువు అయింది. ఈ భూమిలో వరుసగా ఇంటి నిర్మాణాలు కొనసాగుతుండటంపై నవాబ్‌ పేట గ్రామ పంచాయితీ ఈ భూములలో ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని, గ్రామ పంచాయితీ ప్రత్యేక సమావేశం పెట్టి తీర్మానించినట్లుగా తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న ఈ దేవాదాయ శాఖ భూముల పంచాయితీని తేల్చేందుకు కోర్టుద్వార వచ్చిన నోటీసులు చివరికి యన్మన్‌ గండ్ల పంచాయితీకి, దేవాదాయ శాఖకు రావడంతో అసలు మోక నవాబ్‌ పేటలో ఉండటంతో క్షేత్ర స్థాయిలో ఎలాంటి స్పష్టత రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న వేల ఎకరాల దేవాదాయ శాఖ భూములు అక్రమ వెంచర్లుగా కబ్జా కోర ల్లో చిక్కుకుపోయింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ భూ హక్కుల చట్ట పరిరక్షణ పద్దతులు, విధానాలకు విరుద్దంగా, పంచాయితీల పరిధిలో ఏర్పాటయ్యే వ్యవసాయేతర వెంచర్ల ఏర్పాటు, ఇంటి అనుమతులు అన్నీ అక్రమమే. కమీషన్లకు కక్కుర్తిపడి పలువురు స్థానిక నేతల సహకారంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అవ్వడమే కాకుండా హక్కుదారులు లోగుట్టుగా ప్లాట్లు చేసి, కోట్లు సంపాదించి పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లాలోని సర్వీస్‌ ఇనాం భూములను రికార్డుల ఆధారంగా గుర్తించి , ప్రత్యేక సర్వే చేయించి, దేవుడి ఆస్తులను కాపాడాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement