బంజారాల సంస్కృతికి అద్దం పట్టేదే తీజ్ పండగ
పెళ్లికానీ ఆడపడుచులకు ప్రత్యేకం
జన్నారం, ఆగస్టు 26( ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పలు తండాల్లో తీజ్ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. గోర్ బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేది తీజ్ పండగ. తీజ్ అనగా గోధుమ మొలకలు అని అర్థం. ఈ పండగ ముఖ్య ఉద్దేశం బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకోవడం, తాండ నాయక్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇతర తండా పెద్దలను గౌరవించడం. తండాల్లో వర్షాలు బాగా కురిసి ప్రతి తాండ పంట చేన్లు, పొలాలతో ఎంతో పచ్చదనంగా కళకళలాడుతూ ఎప్పుడూ పచ్చగా ఉండడం. ఈ పండుగను పెళ్లి కానీ యుక్త వయస్సు అమ్మాయిలు శ్రావణమాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు.
ఈ పండగ రాఖీ పౌర్ణమికి ప్రారంభమై గోకులాష్టమి పండుగకు ముగిస్తుంది. ఈ పండుగను బంజారా తండాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. వెదురు బుట్టల్లో మోదుగు ఆకులతో గుల్లగా చేసి మట్టిని పోసి గోధుమలను ఉంచుతారు. ప్రతిరోజూ యుక్త వయస్సు, పెళ్ళికాని ఆడపడుచులు ప్రతిరోజూ మూడు పూటలా అందంగా ముస్తాబై, వెదురుబుట్టల్లో ఉన్న గోధుమలకు పులియాగేనో (పూర్ణకుంభం) తలపై పెట్టుకుని చేతి పంపు, బావి, వాగు, చెరువు నీళ్లు తెచ్చి పోస్తారు. పెళ్లికాని యుక్త వయస్సు మగవారు తీజ్ కు నీళ్లు పోయకుండా అడ్డుకుంటారు.
తండాల వాళ్ళందరూ గోర్ బంజారా భాషలో పాటలు పడుతూ, నృత్యాలు చేస్తూ నీళ్లు చల్లుతూ అగరు బత్తులతో ధూపం చేస్తూ నైవేద్యం సమర్పిస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించుకుంటారు. తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ పూజలు చేస్తూ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తర్వాత యుక్త వయస్సు పెళ్ళికాని ఆడ, మగ వాళ్లు ఆ మట్టితో డోక్రి, డోక్రా (ముసలమ్మ, మగ ముసలోళ్ళు) లను సంప్రదాయ పద్ధతిలో తయారుచేసి ఒక పీటపై కూర్చోబెడతారు. దీన్ని గణగోర్ అంటారు. ప్రతిరోజు రాత్రి 9 గంటల్లోపు తండా వాళ్లందరూ భోజనం చేస్తారు. తర్వాత గోధుమ పిండితో తయారుచేసిన రొట్టె, బెల్లం, నెయ్యితో కలిపి ఉండలు తయారు చేస్తారు. దీన్ని చూర్మో ఉంటారు.
ఆ చూర్మోను హారతి పళ్లెంలో వేసి అగరుబత్తులు వెలిగించి, కొబ్బరికాయ, కుంకుమ నీళ్లు తీసుకొని స్త్రీ, పురుషులందరూ పెండ్లి కాబోయే యుక్త వయస్సు ఆడపడుచు తాండ నాయక్ ఇంట్లో ముసలి వాళ్లకు పూజలు చేసి డంబోలి పైనా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు. మరుసటి రోజు యుక్త వేసాడ వారందరూ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి నాయక్ ఇంటి ఆవరణలో ఉన్న తీజ్ గుల్లలను మధ్యలో పెట్టుకుని పెద్ద నాయక్, కారుబారీ, డావ్, డావ్ గెర్యా మాన్కరి అందరూ వచ్చి సాహపంక్తి భోజనం చేస్తారు. తర్వాత పూజలు చేసి, తీజ్ గుల్లలను పెళ్ళికాని ఆడవారు నెత్తిన పెట్టుకొని నృత్యాలు చేస్తారు. అనంతరం పెళ్లి కాని ఆడవారి వదినలు గుల్లలను లాక్కొని వారి అమ్మలకు ఇస్తారు.
అమ్మలు తీజ్ తెంపి పెళ్లి కాని ఆడవారికి ఇచ్చినంకా వారు విడిగా ఉన్న తీజ్ ను పెద్దలందరికీ పంచుతూ కాళ్ళు మొక్కుతారు. ఆ గ్రామ పెద్దలు తోచిన విధంగా కానుకలు ఇస్తారు. 9వ రోజైనా కృష్ణాష్టమిన ముగింపు సందర్భంగా ఉదయాన్నే తండా వారందరూ లేచి తల స్నానం చేసి నూతన బట్టలు ధరించి జొన్నలు, గోధుమలు,శనిగలు ఉడకబెట్టి గుడాలుగా తయారుచేస్తారు.ఆ తర్వాత ఎడ్ల బండిని,ఎడ్లను అలంకరించి,ఆ బండిలో తీజ్ ను ఉంచి బాజా భజంత్రీలతో తండా అంతా నాయక్ ఆధ్వర్యంలో ఊరేగించి, సమీపాన ఉన్న చెరువుల,వాగుల,కుంటలలో నిమజ్జనం చేస్తారు.ప్రత్యేకంగా తయారు చేసిన గుడాలను పెళ్ళికాని ఆడవాళ్ళు నాయక్, గ్రామ పెద్దల, తల్లిదండ్రుల, అన్నల, తమ్ముల కాళ్లు కడిగి మొక్కుతూ అందరికీ పంచి పెడుతూ పండగను ముగిస్తారు.