Wednesday, September 18, 2024

ADB: శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు.. ఎస్పీ గౌష్ ఆలం

ఇంద్రవేల్లి : శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవని, జైనూర్ ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం హెచ్చరించారు. బుధవారం మండలంలోని కేస్లాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగోబా దర్బార్ హాల్లో మండలంలోని ఆదివాసీ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఆదివాసీ పెద్దల అభిప్రాయాలను సేకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఆదివాసీ మహిళపై దాడి జరగడం బాధాకరమని, ఈ ఘటనపై సంయమనం పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించకూడదని సూచించారు. హత్యాయత్నం, లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే నిందితులను జైనూర్‌ పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారన్నారు.

గాంధీ ఆస్పత్రిలో బాధితురాలికి వైద్య చికిత్స కొనసాగుతోందని, అన్ని చికిత్స ఖర్చులనూ ప్రభుత్వమే భరిస్తోందని, బాధితురాలికి ఇప్పటికే రూ.లక్ష పరిహారం అందించినట్టు తెలిపారు. వదంతులను నమ్మొద్దని, రెచ్చగొట్టే సోషల్‌ మీడియా పోస్ట్‌లను ప్రసారం చేస్తే కఠిన చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసిందని నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేసిన వారిపై, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకోబడతాయని, కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఆదివాసీ జిల్లా సార్మేడీ మెస్రం దుర్గు, ఆదివాసీ సమన్వయ కర్త సీడాం భీంరావ్, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, వడ్ గావ్ సార్మేడీ మెస్రం చిన్ను, గిన్నేరా సార్మేడీ తుంరం జుగదిరావు, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ గౌడ్, సీఐ మొగిలి, ఎస్సై దుబ్బాక సునీల్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పూర్క బాపురావు, ఆర్కా ఖమ్ము, కనక తుకారం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement