Monday, November 25, 2024

ఉత్పత్తిని సాధించడం ప్రతి కార్మికుడి బాద్యత..

బెల్లంపల్లి : ఉత్పత్తిని సాధించేందుకు ప్రతీ కార్మికుడు తమవంతు బాధ్యతగా పనిచేయాలని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ అన్నారు. ఫస్ట్‌ షిప్టు ఉద్యోగులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థలో తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ సాధించిన ప్రగతిపై ఉద్యోగులకు వివరించారు. విద్యుత్‌ రంగం నుండి 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను నిర్మించుకొని ప్రారంభించబోతున్నారని అన్నారు. అందులో భాగంగా కాసిపేట మండలంలోని ముత్యంపల్లిలో 17 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను డైరెక్టర్‌ ఈఅండ్‌ఎం డి.సత్యనారాయణ ప్రారంభించడం జరిగిందని అన్నారు. తొలిసారిగా ఒరిస్సా రాష్ట్రంలో రెండు భారీ గనులకు అనుమతులు పొందడం జరిగిందని, అలాగే కారుణ్య నియామకాల ప్రక్రియలో 10,700 మందికి వారసత్వ ఉద్యోగాలను కల్పించుకున్నామని, కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి రూ.10లక్షల వడ్డీ లేని రుణాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా ఉత్పత్తిలో వెనుకంజలో ఉన్నామని, ఈ సంవత్సరం సింగరేణి సంస్థ నిర్ణయించిన ఉత్పత్తిని సాధించేందుకు ప్రతీఒక్క ఉద్యోగి తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. అలాగే కొత్తగా చేరిన ఉద్యోగులు నాగాలు చేయకుండా విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతిఖని గని ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఓ-2 జీఎం గోపాల్‌సింగ్‌, డీజీఎం రాజన్న, ఎస్‌ఎస్‌ఓ ఓదెలు, పీఎం వరప్రసాద్‌, గని మేనేజర్‌ బిక్షమయ్య, సీఎంఓఏ నాగవర్దన్‌, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్‌ సెక్రటరి మిట్టపల్లి వెంకటస్వామి, ఫిట్‌ సెక్రటరి అశోక్‌, టీబీజీకెఎస్‌ ఫిట్‌ సెక్రటరి దాసరి శ్రీనివాస్‌, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement