బెల్లంపల్లి : ఉత్పత్తిని సాధించే దిశగా ప్రతీ ఉద్యోగి తమవంతు బాధ్యతను పూర్తిగా నిర్వహించాలని మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. శాంతిఖని గనిలో 2వ షిప్టు ఉద్యోగులతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి సంస్థలో తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ సాధించిన ప్రగతిని ఉద్యోగులకు క్లుప్తంగా వివరించారు. విద్యుత్ రంగం నుండి 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను నిర్మించుకొని ప్రారంభించబోతున్నారని, తొలిసారి ఒరిస్సా రాష్ట్రంలో రెండు భారీ గనులకు అనుమతి సాధించామని, తొలి గని నైని బొగ్గు బ్లాక్ నుండి ఈ యేడాది రూ.10లక్షల బొగ్గు ఉత్పత్తి సాధించామని అన్నారు. అలాగే కారుణ్య నియామకాల ప్రక్రియలో 10,702 మంది వారసులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, కార్మికుని సొంత ఇంటి నిర్మాణానికి రుణంపై వడ్డీ చెల్లిస్తుందని, ఉద్యోగుల గృహాల్లో ఏసీ మంజూరు చేయించారని, గనుల్లో క్యాంటీన్లు, మ్యాన్ రైడింగ్ లాంటి సౌకర్యాలను ఆధునీకరించారని, ఉద్యోగులకు తేలికపాటి క్యాంపు ల్యాంపులను ఏర్పాటు చేశారని, ఉద్యోగుల సౌకర్యం కోసం స్విమ్మింగ్‌ఫుల్, జిమ్‌లు, ఏసీ కమ్యూనిటీ హాల్, పార్కులు, యోగా హాల్, సింగరేణి సూపర్‌మాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 8 కొత్త గనులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఇప్పటి వరకు కరోనా కారణంగా ఉత్పత్తిలో వెనుకంజలో ఉన్నామని, ఈ సంవత్సరం సింగరేణి సంస్థ నిర్ణయించిన ఉత్పత్తిని సాధించే దిశగా ప్రతీఒక్క ఉద్యోగి తమ బాధ్యతను పూర్తి చేయాలని అన్నారు. కొత్తగా చేరిన ఉద్యోగులు నాగాలు చేయకుండా డ్యూటీకి హాజరై సింగరేణి ప్రగతిలో భాగస్వామ్యులు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాంతిఖని గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఓ-2 జీఎం గోపాల్ సింగ్, డీజీఎం రాజన్న, ఎస్‌ఎస్‌ఓ ఓదెలు, గని మేనేజర్ బిక్షమయ్య, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరి తిరుపతిగౌడ్, టీబీజీకెఎస్ ఫిట్ సెక్రటరి దాసరి సుదర్శన్, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement