Monday, November 25, 2024

అధికారులకు తప్పని వేధింపులు..

మంచిర్యాల : ప్రభుత్వాలు, అవినీతి రైతాంగం పారదర్శకంగా పరిపాలన సాగాలంటే పాలన ఏ విధంగా జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చింది. సత్పరిపాలన జరగాలన్న ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం 2005 జూన్‌ 15వ తేదిన సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. పాలకుల అక్రమాలను వెలికితీసి అవినీతిని ఎండగట్టే ఈ పాశుపతాస్త్రం సైతం నేడు పక్కదారి పడుతోంది. ఆర్టీఏ చట్టాన్ని అడ్డు పెట్టుకొని కొందరు దుర్మార్గులు అక్రమాలకు, బ్లాక్‌మేయిలింగ్‌ దంధాకు తెర లేపారు. ఈ చట్టం ద్వారా భూముల సమాచారం తీసుకొని దశాబ్దాల క్రితం జరిగిన రిజిస్ట్రేషన్లలో, భూ బదలాయింపులలో దొర్లిన చిన్నపాటి తప్పులను ఎత్తిచూపి సదరు భూ యజమానులపై బ్లాక్‌మేయిలింగ్‌కు పాల్పడుతున్నారు. ఆ సాకుతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, హైకోర్టులో పీల్‌ వేస్తామని బ్లాక్‌మేయిలింగ్‌ చేస్తూ ఈ లంపెన్‌ గ్యాంగులు లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నాయి. కొందరు ఇదెక్కడి గొడవ రా అంటూ వారికి భయపడుతూ డబ్బులను ముట్టజెప్తుండటంతో వారి దంధా మూడు పువ్వులు, ఆరు గాయలుగా సాగుతోంది. అమాయకులు కనిపిస్తే వారి భూమిలో పాలు పంచి ఇవ్వాలని ఈ లంపెన్‌ గ్యాంగులు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసుల్లో రెవెన్యూ అధికారులను సైతం ఈ ముఠా వేదింపులకు గురిచేస్తోంది. జిల్లాలోని నెన్నెల, భీమిని, కన్నెపల్లి, మందమర్రి, మంచిర్యాల, జైపూర్‌, చెన్నూరు మండలాల్లో కొందరు ఇదే వృత్తిగా కొనసాగుతున్నారు. ఆర్టీఏ ద్వారా సమాచారం తీసుకుంటున్న ఈ ముఠాలు వారిలో అమాయకులు ఉంటే వారిని బోల్తా కొట్టించి బ్లాక్‌మేయిలింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ విషయంలో అధికారులు భూ రికార్డులు తేవాలని సదరు భూ
యజమానులను కోరితే తాతలు, తండ్రుల కాలం నాటి కాగితాలను ఎక్కడి నుండి తేవాలో తెలియక కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందేమోనని భయపడి ఎంతో కొంత ఈ గ్యాంగులకు డబ్బులను చెల్లించుకుంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డ బ్లాక్‌మేయిలర్లు రోజుకో సమాచార హక్కు చట్టం ధరఖాస్తును పట్టుకొని తహశిల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వారి ఆగడాలను ఆట కట్టించేందుకు చట్టంలో మార్పు తీసుకురావాలని బాదితులు మొర పెట్టుకుంటున్నారు. ఈ ముఠాల వల్ల అమాయక ప్రజలతో పాటు అధికారులతో కూడా వేధింపులు తప్పడం లేదు. ఈ విషయాలపై ఇప్పటికీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు రానప్పటికీ పోలీస్‌ అధికార యంత్రాంగం ఈ విషయంలో దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. భూదంధాలకు, అక్రమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, రిజిస్ట్రార్‌ కానీ చిట్‌ఫండ్‌లు, గుట్కా, అక్రమ మత్తుపదార్థాలు, నకిలీ విత్తనాలతో పాటు మోసాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న రామగుండం కమీషనర్‌ సీపీ వి.సత్యనారాయణ ఆర్టీఐ చట్టం బ్లాక్‌మేయిలింగ్‌కు పాల్పడుతున్న ఇలాంటి ముఠాల పట్ల దృష్టి సారించాలని బాధితులు ప్రాదేయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement