Tuesday, November 19, 2024

ADB: డెంగీ జ్వరంతో ఆర్ఎంపీ మృతి… మృతదేహంతో ఆస్పత్రి ముందు ధర్నా

మంచిర్యాల, అక్టోబర్ 27 (ప్రభన్యూస్): డెంగీ జ్వరంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామానికి చెందిన రాజమౌళి (38) అనే ఆర్ఎంపీ మృతిచెందాడు. ఆయన మృతికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యమే కారణమంటూ కుటుంబసభ్యులు శుక్రవారం ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరం రాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించామని, వైద్య పరీక్షలు చేసి డెంగీ జ్వరమని తేల్చి తెల్ల రక్త కణాలు 87 వేలు ఉన్నాయని, చికిత్స అందించి బాగు చేస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. నాలుగు రోజులుగా ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి చివరకు తమకు తీరని శోకాన్ని మిగిల్చారని ఆరోపించారు.

వైద్యుడు గణేష్ రాథోడ్ అందుబాటులో లేకున్నా ఆసుపత్రిలో చేర్పించుకొని సరైన అవగాహన లేని డ్యూటీ డాక్టర్లు వైద్య చికిత్సలు అందించారని, తమతో కానప్పుడు ముందుగానే విషయాన్ని చెప్తే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లాంటి నగరానికి తీసుకెళ్లి ప్రాణాలను దక్కించుకునే వాళ్లమని, కానీ అందుకు అవకాశం లేకుండా కాసులకు కక్కుర్తి పడి రోగి పరిస్థితి విషమించే వరకు ఆసుపత్రిలోనే ఉంచుకొని కాలయాపన చేశారని, తీరా చేయి దాటిన తర్వాత మెరుగైన వైద్యం కోసం తరలించాలని చెప్పారని, అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆయనను కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించే సరికే మృతి చెందాడని తెలిపారు. ఆయన మృతికి ముమ్మాటికి ఆసుపత్రి వైద్యులే కారణమని బాధిత కుటుంబసభ్యులు మండిపాటును వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రాజు తన సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకొని వివరాలు తెలుసుకొని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయే సరికి ఆసుపత్రి యాజమాన్యంతో ఫోన్ లో మాట్లాడించి హామీ ఇప్పించడంతో మృతుని కుటుబసభ్యులు ఆందోళనను విరమించి మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకువెళ్లారు. మృతునికి భార్య సుజాత ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement