మంచిర్యాల : జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభన ఒకవైపు కొనసాగుతుండగా బాధితులు ప్రభుత్వ వైద్యానికి మొగ్గు చూపకుండా లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బెల్లంపల్లిలోని సింగరేణి కోవిడ్ ఆసుపత్రిలో 120 పడకలు ఉండగా అందులో ప్రస్తుతం సగం మాత్రమే వైద్య చికిత్సలు పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు ఎవరు వెళ్లడం లేదు. గతంలో రోగులు లేక మూత పడ్డ ఆసుపత్రులు కరోనా బాధితుల రాకతో తెరుచుకున్నాయి. ఆసుపత్రుల్లో పనిచేసేందుకు డాక్టర్లు, సిబ్బంది కావాలంటూ పత్రికా ప్రకటనలు ఇస్తున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ రాష్ట్రాల నుండి కరోనా బాధితుల రాక పెరగడంతో ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. మధ్య దళారులను పెట్టుకొని వారికి కమీషన్లు ఇస్తూ అవసరం లేనప్పటికీ ఇంజక్షన్ల పేరిట, కమీషన్ల పేరిట అమాయక ప్రజల నుండి డబ్బులు దండుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రజలు ప్రభుత్వ వైద్యానికి మొగ్గు చూపకుండా ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్లడం గమనార్హం. దీంతో ప్రైవేటు ఆసుపత్రులపై పర్యవేక్షణ కరువు కావడంతో వారి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభనతో వ్యాక్సినేషన్ చేసుకునేందుకు వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. జిల్లా వ్యాప్తంగా రోజు 500లకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా బారిన పడ్డ జర్నలిస్టుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. పట్టణాలకు మించి గ్రామీణ ప్రాంతాల్లోనే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వరి పంట కోతలకు రావడం, మిర్చి ఏరడం, మిర్చి, పల్లి పనులు జరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ వారిని ఇబ్బందులకు నెడుతోంది. కూలీల కొరత తీవ్రంగా ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రజలు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. గ్రామాల్లోకి రాకపోకలను నిషేధిస్తున్నారు. కాసిపేట, వేమనపల్లి, కోటపల్లి, దండేపల్లి, జన్నారం మండలాల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. దూర ప్రాంతాల్లో నుండి జిల్లా కేంద్రానికి కరోనా వైద్య పరీక్షల నిమిత్తం రావడం ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో మండల కేంద్రాల్లోనే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కరోనా బారీన పడుతున్న వారి సంఖ్య ఒకవైపు పెరుగుతుండగా మృతుల సంఖ్య కూడా ఆ మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వాసుపత్రులు వద్దు…ప్రైవేటు ఆసుపత్రులే ముద్దు..
By sree nivas
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement