Tuesday, November 26, 2024

ADB: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలి.. కలెక్టర్

ఆసిఫాబాద్, నవంబర్ 6 (ప్రభ న్యూస్) : జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు జరగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆసిఫాబాద్ ఆర్డీఓ సురేష్ తో కలిపి శాసనసభ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ప్రచార సంబంధిత సభలు, ర్యాలీలు, సమావేశాలు, వాహనాలు, ప్రకటనల కోసం సంబంధిత అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.

ఐదు కిలోమీటర్ల కంటే దూరంగా ఉన్న ఓటర్ల కోసం అదనపు పోలింగ్ కేంద్రాల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని తిర్యాణి మండలం మందగూడ పోలింగ్ కేంద్రం నుండి బుగ్గగూడ, భీంజిగూడ, తాటి మాదర హాబిడేషన్లతో కలిపి బుగ్గగూడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు, సిర్పూర్ నియోజకవర్గంలో సిర్పూర్ టి మండలంలోని హుడ్కిల్ పోలింగ్ కేంద్రం నుండి ఇటిక్యాల పహాడ్ గ్రామాన్ని తొలగించి ఇటిక్యాల్ పహాడ్ గ్రామంలో అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు కోసం ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ దాఖలు చేయు అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ఉండాలని, నామినేషన్ దాఖలు చేసే సమయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి 100మీటర్ల రేడియస్ లోపు నామినేషన్ దాఖలు చేయు అభ్యర్థితో కలిపి 5మందికి అనుమతి ఉంటుందని, మొత్తం 3 వాహనాలు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. ఒక్క అభ్యర్థి 4సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అత్యధికంగా 2 ప్రాంతాల్లో పోటీ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement