మంచిర్యాల : పిచ్చుకలు ఒకనాడు పంటచేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాలలోని ఇండ్ల ముంగిట ఇవి గుంపులుగుంపులుగా వాలడం ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగిరిపోవడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి. ఇవి దిగుడు బావులలోకి వేలాడుతూ చెట్లపై కట్టుకున్న గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పూరిళ్ల చూరులలో గూళ్లు కట్టుకొని జనావాసాలతో మమేకమై ఉండేవి. మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి. జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాలలో ఇవి మెత్తని పీచు వంటి వాటితో గూడు కట్టుకోవడంతో పాటు ఆ గూడులో గుడ్లను పొదగడం, నోటీతో ఆహారాన్ని తెచ్చి తన పిల్లలకు అందిస్తుంటాయి. ఆ పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరేంత వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండే దృశ్యాలు మనకు తరచూ కనిస్తూనే ఉంటాయి. పిచ్చుకలను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతీ యేడాది మార్చి 20వ తేదిని ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఈ పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాధ ఏర్పడితే అది మానవ మనుగడకు ఎందుకు ప్రమాదం కాదని గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రపంచ పిచ్చుకల దినోత్సవంను నాడు పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నారు.
పిచ్చుక చిన్నదే… అయినా దీన్ని బ్రతికించుకోవాలి : అభివృద్ధి చెందుతున్న సాంకేతిక జీవన విధానం వల్ల పిచ్చుకల సంఖ్య ప్రతీయేటా తగ్గుతూపోతోంది. మనిషితో కలిసి జవించే పిచ్చుక జాతి పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి మరెంతో దూరం లేకపోలేదు. పిచ్చుక జాతిని రక్షించుకోకుంటే భవిష్యత్తు తరాలకు పిచ్చుక బొమ్మను చూపించి ఇది పిచ్చుక అనే పక్షి, మన ఇండ్లలోనే తిరిగేదని చెప్పాల్సిన పరిస్థితి రానుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉన్న పిచ్చుకలనైనా బ్రతికించుకుందాం.
పిచ్చుకలు హరించుకుపోవడానికి కారణాలు
—టి.మాధవి (జీవ వైవిద్య నిపుణురాలు) : పిచ్చుకలు హరించుకుపోవడానికి మానవుడు అనుసరిస్తున్న విధానాల కారణం. వాహనాలను వాడే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఇంధన కాలుష్యం నెలకొంటుంది. గృహ నిర్మాణాల్లో మార్పులు జరగడంతో అపార్ట్‌మెంట్ కల్చర్ పెరుగుతోంది. సాంకేతికతతో అనేక మార్పులు రావడం. ఉదాహరణకు సెల్‌ఫోన్ వాడకంలో మొదట 2జీ నెట్‌వర్క్, ఆ తర్వాత 3జీ నెట్‌వర్క్, తదనంతరం 4జీ నెట్‌వర్క్, ఇప్పుడు కొత్తగా 5జీ నెట్‌వర్క్ ఇలా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్ది రేడియేషన్ ప్రభావం విపరీతంగా పెరిగిపోతూ పిచ్చుకలు హరించుకుపోవడానికి కారణమవుతున్నాయి.
ఇలా సంరక్షించుకోవచ్చు
గుండేటే యోగేశ్వర్ (పర్యావరణవేత్త) : పిచ్చుక జాతి సంరక్షణకై ఇంట్లో మట్టి పాత్రలో నీరు పోసి ఉంచాలి. వివిధ సందర్భాల్లో ఇంటి ముందు వేసే ముగ్గుల్లో రసాయనాలు లేని పిండితో వేస్తే ఆహారంగా ఉపయోగపడుతుంది. పిచ్చుకల అవాసం కోసం అట్ట, కర్ర లేదా వెదురుతో చేసిన ప్రత్యేక గూళ్లను ఏర్పాటు చేసి ఆశ్రయం కల్గించాలి. ఇంటి ముందు పరిసరాల్లో వివిధ ధాన్యపు గింజలను చల్లితే ఆహారం కోసం ఇంటి వద్దకే పిచ్చుకలు చేరి కనువిందు చేస్తాయి.