నిర్మల్ ప్రతినిధి సెప్టెంబర్ 3 (ప్రభ న్యూస్) : జీఎన్ఆర్ కాలనీ ముంపునకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జలమయమైన జీఎన్ఆర్ కాలనీలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిలు పర్యటించి పరిశీలించిన అనంతరం బాధితులతో కలిసి మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముంపునకు గురైన జీఎన్ఆర్ కాలనీలో ఫోటో ప్రదర్శనకు మంగళవారం రాష్ట్ర మంత్రి హాజరై పర్యటించారు. మంత్రికి కాలనీలో నెలకొన్న సమస్యలను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివరించారు. కాలనీవాసులు తాము పడుతున్న కష్టాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమకు వర్షం కురిసిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ నిద్ర లేని రాత్రులు గడపవలసి వస్తుందని బాధిత కుటుంబాలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తక్షణమే వరద కాలువను వెడల్పు చేయాలని, దాంతోపాటు చెక్ డ్యామ్ పొడవును రెండు ఫీట్ల మేరకు తగ్గిస్తే ఈ వరద ఉధృతి తగ్గుతుందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో రెండు మూడు నెలల్లో ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ఇంజనీర్లను పర్యటించే విధంగా చర్యలు చేపట్టి శాశ్వత పరిష్కారం కోసం మార్గం చూపుతామని మంత్రి ఈ సందర్భంగా బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు ప్రవీణ్ కుమార్ హైజిల్ అహ్మద్, ఎస్పీ జానకి షర్మిల, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.