- ఆగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత..!
- రాజకీయ ఒత్తిళ్లు కారణమా..! అధికారుల నిర్లక్ష్యమా..!
ఆసిఫాబాద్, నవంబర్ 20, (ఆంధ్రప్రభ ప్రతినిధి) : అసిఫాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలోని బీడీపీపీ భూముల్లో అక్రమ కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే భారీ భవనాలు నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు రెవెన్యూ కార్యాలయాలకు వస్తున్నాయి. పలు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు రెవెన్యూ అధికారులు స్పందించి ఐదుగురి వ్యక్తులకు బీడీపీపీ భూముల్లో భవనాలు నిర్మించిన వారికి నాలా కబ్జా చేసి చదును చేసిన వ్యక్తికి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. నోటీసులకు వారంలోగా సమాధానాలు ఇవ్వాల్సిందిగా కోరగా… కేవలం ఒకే వ్యక్తి సమాధానం ఇచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. నాలా చదును చేసిన వ్యక్తికి చెందిన స్థలంలో జేసీబీలతో నాలాలో మట్టిని తొలగించారు. ఒకరోజు హడావుడి చేసిన అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కొన్ని రోజుల పాటు హడావుడి చేసే అధికారులు విషయాన్ని మరిచిపోతున్నారు.
ఈ అక్రమాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం కొద్ది రోజులపాటు హడావుడి చేసినట్లు కనిపిస్తుంది. బీడీపీపీ భూముల్లో స్థలాలు కొనుగోలు చేసి, ఎటువంటి అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మాణాలు చేస్తున్నప్పటికీ వీరికి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు విద్యుత్ సౌకర్యం, మంచినీటి సరఫరా, తదితర సౌకర్యాలు అధికారులు ఎలా కల్పిస్తున్నారని స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కొంతమంది ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటా.. రోహిత్ దేశ్ పాండే, తహసిల్దార్ ఆసిఫాబాద్
ఆసిఫాబాద్ పట్టణంలోని చెక్ పోస్ట్ సమీపంలో బీడీపీపీ, అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. గతంలో వారికి నోటీసులు జారీ చేశాం. ఐదు రోజుల సమయం ఇవ్వాలని వారు మౌఖికంగా కోరారు. మరోసారి నోటీసులు జారీ చేసి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. బీడీపీపీ, అసైన్డ్ భూములు అమ్మరాదు.. కొనరాదు.. ఇది చట్ట విరుద్ధం. ఇలాంటి భూములను అమ్మిన, కొన్న వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు.