Sunday, November 17, 2024

ADB: హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే బోజ్జు పటేల్…

ఉట్నూర్, జూన్ 7 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే దిశగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ – పొద్దు పొడుపు బొజ్జన్న అడుగు (మార్నింగ్ వాక్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నాడు మాట్టిచ్చి – నేడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాటను నిలబెట్టుకున్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలం లోని బోయవాడ, శాంతినగర్, పాత ఉట్నూర్, ఎత్మాసూర్ నగర్ కాలనీల్లో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజలు చేసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, చెప్పిందే చేస్తుందని… చేసేదే చెప్తుందని అన్నారు. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తామన్నారు. నియోజకవర్గంలోని నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. పేదింటి బిడ్డయిన తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యూం, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ లింగంపల్లి చంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఎక్బాల్, ఉట్నూర్ సహకార చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు బిరుదుల లాజర్, దూట రాజేశ్వర్, సలీం జావిద్ అన్సర్, సలీం, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement