భీమిని : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, త్రాగునీటి ట్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి. దీంతో ప్రజలు వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేట గ్రామపంచాయితీలోని పెద్దపేట, ఎస్సీ కాలనీ, చెన్నాపూర్ గ్రామాల్లో నూతనంగా మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకులను ప్రభుత్వం నిర్మాణం చేయించింది. పైప్‌లైన్ నిర్మాణాలు కూడా పూర్తి అయ్యాయి. కానీ నీటి సరఫరా జరగకపోవడంతో మూడు గ్రామాల ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. పెద్దపేట గ్రామంలో గ్రామానికి ఆనుకొని ఉన్న వాగులో బోర్లను నిర్మాణం చేసుకొని కరెంట్ మోటర్‌లను బిగించుకొని ప్రతీ ఇంటికి పైప్‌లైన్లను ఏర్పాటు చేసుకొని త్రాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఎస్సీ కాలనీ, చెన్నాపూర్ గ్రామాల్లో బావులు, చేతిపంపులపైనే ప్రజలు ఆధారపడాల్సివస్తోంది. మరికొంత మంది బండ్ల ద్వారా డ్రమ్ముల్లో నీటిని తెచ్చుకొని అవసరాలను తీర్చుకుంటున్నారు. లక్షలాది రూపాయలను వెచ్చించి నిర్మాణం చేసిన ట్యాంకులు వృధాగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వీటిపై దృష్టి సారించి త్రాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకొని మా దాహార్తిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement