నిర్మల్ ప్రతినిధి, మే 3 (ప్రభ న్యూస్) : దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తూ.. దేవుళ్లకే శఠగోపం పెట్టిన బీజేపీ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిర్మల్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ.. గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో సమావేశమయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వంద రోజులు పనికి గత పది ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వ కూలీ పెంచలేదన్నారు.
అంతేకాకుండా పేదలు ఉపయోగించే వస్తువులపైన పన్నులు వేసి పీడిస్తున్నారన్నారు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే తప్ప గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎక్కడా చేయలేదన్నారు. అయోధ్య రాముడు పేరుతో దేశంలో అన్ని కుటుంబాల నుంచి లక్షల కోట్లు చందాలు వసూలు చేసి, ఖర్చు పెడుతున్నారే గాని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రాముడికి మొండి చేయి చూపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, ఆర్టీసీ చార్జీలు పెంచారు. పేదలు ఉపయోగించే ప్రయాణ వాహనాలకు భారంగా మార్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని మంత్రి పేర్కొన్నారు.
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కేంద్రంలో కొత్త నిబంధనలతో ఉద్యోగులకు భద్రత లేకుండా చేశారని మండిపడ్డారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు పథకాలను ప్రవేశపెడుతుందన్నారు సీతక్క. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు మహిళా సంఘాలకు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులకు ఉపయోగపడేలా చేస్తామన్నారు.
రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క..
నిర్మల్ పట్టణంలోని క్రషర్ గుండు వద్ద ఈనెల 5న జరగనున్న రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్యంగా నిర్మల్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో జనాన్ని తరలించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను ఆదేశించారు.
బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీటి, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆరు సంక్షేమ పథకాలను ఇంటింట వివరించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేలా చూడాలని కార్యకర్తలకు సూచించాలని నాయకులకు హితబోధ చేశారు. సభాస్థలిని సందర్శించిన ఆమె వెంట డీసీసీ అధ్యక్షులు కే.శ్రీహర్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, తదితరులు ఉన్నారు.