ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: మార్కెట్ లో పత్తి విత్తనాల కోసం రైతులు రెండో రోజు మండుటెండల్లో పడరాని పాట్లు పడ్డారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన రైతులు ఉదయం నుండే విత్తన దుకాణాల వద్ద బారులు తీరారు. మంగళవారం ఆదిలాబాద్ లోని పలు దుకాణాల వద్ద తోపులాటలు.. సల్ప ఉద్రి క్తతలు తలెత్తిన నేపథ్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్ రాజార్షి షా, వ్యవసాయ అధికారులతో కలిసి విత్తన దుకాణాల్లో రికార్డులు పరిశీలించారు.
వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణల మేరకు జిల్లాకు వచ్చిన విత్తనాల స్టాక్ గురించి.. ఇప్పటివరకు రైతులకు విక్రయించిన విత్తనాల సంచుల గురించి ఆరా తీశారు. రైతులకు డిమాండ్ ఉన్న ..రాశి – 659 రకం విత్తనాలను రెండు, మూడు రోజుల్లో తెప్పిస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు.
ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు..
అదిలాబాద్ విత్తనాల మార్కెట్ లో పత్తి విత్తనాల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో జిల్లా ఎస్పీ గౌస్ అలం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో వ్యక్తికి రెండు పత్తి సంచులు ఇప్పించేలా చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి అన్ని విత్తనాలు దుకాణాల వద్ద రైతుల పరిస్థితి పై ఆరాతీసి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
మరో రెండు రోజుల్లో 30 వేల బ్యాగులు.. జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య
పత్తి రైతులకు అవసరమైన రాశి కంపెనీకి చెందిన 47 వేల పత్తి సంచులు విక్రయించడం జరిగిందని, రెండు రోజుల్లో 20000 బ్యాగులు అదనంగా తెప్పిస్తున్నామని అన్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి విత్తనాల కొరత లేకుండా కంపెనీలతో సంప్రదిస్తున్నారని తెలిపారు. గత ఏడాది రాశి కంపెనీ విత్తనాల బ్యాగులు లక్షా పది వేలు అందించామని,ఈసారి 1,20,000 పత్తి విత్తనాల సంచులు అందించేలా ప్రణాళిక రూపొందించుకున్నామని తెలిపారు.
విత్తనాల కొరత పై బిఆర్ఎస్ నిరసన..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యను పట్టించుకోకుండా విత్తనాల సరఫరాలు వైఫల్యం చెందిందని నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అదనపు కలెక్టర్ శ్యామల దేవికి వినతిపత్రం సమర్పించారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ శాఖ కమిషనర్, మంత్రికి ఎమ్మెల్యే వినతి
అదిలాబాదులో పత్తి రైతులు పత్తి విత్తనాల కొరతతో ఇబ్బందులకు గురవుతున్నారని, యుద్ధ ప్రాతిపదికన రాశి కంపెనీ విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు, కమిషనర్ రఘునందన్ రావుకు విన్నవించారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల సమస్యలు విత్తనాల కొరత గురించి వినతి పత్రాలను సమర్పించారు.