Wednesday, October 30, 2024

Maharashtra election effect : మూడు చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

మద్యం, డబ్బు, గంజాయి రవాణాకు అడ్డుకట్ట
మహారాష్ట్రలోని దిగ్రస్, పర్సోడ చెక్పోస్టుల పరిశీలన

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : మహారాష్ట్రలో తొలివిడతగా శుక్రవారం జరుగుతున్న ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం మహారాష్ట్రతో సరిహద్దులో ఉన్న మూడు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందిని అలర్ట్ చేశారు. తనిఖీ కేంద్రాల వద్ద నిఘా పనితీరు సిబ్బంది విధులను పరిశీలించారు. మొదటగా జైనథ్ మండలం పిప్పర్ వాడ చెక్ పోస్ట్ ను చేరుకొని అక్కడి నుండి ఆదిలాబాద్ కు వస్తున్న వాహనాలను , ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్లే వాహనాలను పరిశీలించారు. ప్రజలు రూ.50వేల కన్నా ఎక్కువ నగదును తీసుకొని వస్తే దానికి సంబంధిత రసీదులను కలిగి ఉండాలని సూచించారు.

స్వాధీనం చేసుకున్న నగదు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఆధీనంలో ఉంటుందని సంబంధిత పత్రాలను చూపించి డబ్బును విడిపించుకోవాలని సూచించారు. అదేవిధంగా మహారాష్ట్రతో అనుసంధానం చేసే ఆనందపూర్ చెక్ పోస్ట్ ను పరిశీలించారు. యావత్ మాల్ జిల్లాతో సరిహద్దున గల దిగ్రస్ చెక్ పోస్ట్ ను కూడా పరిశీలించారు. చంద్రపూర్ జిల్లా సరిహద్దుతో ఉన్న శంకర్ గూడా చెక్ పోస్ట్ ను అవతల వైపు ఉన్న పరసోడా చెక్ పోస్ట్ ను కూడా పరిశీలించడం జరిగింది. జైనథ్ మండలంలో సీఆర్పిఎఫ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి వారికి రానున్న ఎన్నికల సందర్భంగా నిర్వహించవలసిన విధులపై సూచనలు చేయడం జరిగింది.

రూ.34 లక్షల 48వేల సీజ్..
ఇప్పటి వరకు జిల్లాలో సరైన ఆధార పత్రాలు లేకుండా రవాణా అవుతున్న రూ.34,48,060 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీతెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వి.శ్రీకాంత్, డిప్యూటీ కమాండెంట్ స్వప్నిల్ పవర్, జైనథ్ ఎస్సై వి పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement