Thursday, September 5, 2024

Adilabad – రైతన్నపై విరిగిన లాఠీ…విత్త‌నాల కోసం అన్నదాతల అవస్థలు… వారం రోజులుగా పడిగాపులు

అడుగడుగునా విత్త‌న గోస‌
డిమాండ్‌ మేర సప్లయ్​ లేక అవ‌స్థ‌లు
వారం రోజులుగా ప‌డిగాపులుకాస్తున్న రైతులు
పట్ట‌ణంలో ట్రాఫిక్ జామ్‌..
కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆందోళ‌న‌
రంగంలోకి దిగిన‌ పోలీసులు..
పోలీసులు, రైతులకు మధ్య తోపులాట
ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో పోలీసులు లాఠీచార్జీ
విత్త‌నాలు రెడీగా ఉన్నాయంటున్న అధికారులు

- Advertisement -

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్:

పత్తి విత్తనాల కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు దొరక్క అగచాట్లు పడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచే విత్తనాల దుకాణాల ఎదుట క్యూ క‌ట్టారు. కొర‌త‌గా ఉన్న బోల్ గార్డ్ 2- రాశి 695 రకం విత్తనాలు సోమవారం రాత్రి 27 వేల విత్తనాల ప్యాకెట్లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయనే సమాచారం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ఉదయం ఏడు గంటలకే జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది ఫర్టిలైజర్ దుకాణాల వద్ద ఒక్కో రైతుకు ఆధార్ కార్డును బట్టి రెండు విత్తన సంచులను అందించారు.

వేలాదిగా వ‌చ్చిన రైతులు
ఆదిలాబాద్ జిల్లా తామ్సీ తలమడుగు బీంపూర్, ఉని జైనథ్, బేల, మావల, ఆదిలాబాద్ రూరల్ మండలాల నుండి వేలాదిగా రైతులు తరలివ‌చ్చారు. దీంతో ఆదిలాబాద్ మార్కెట్, అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్, పంజాబ్ చౌరస్తా కిక్కిరిసిపోయింది. బడా వ్యాపారులు డీలర్లు కలిసి రైతులకు అవసరమైన డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించి మహారాష్ట్రకు తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని దుకాణాల వద్ద గంట సేపటికే నో స్టాక్ బోర్డులు పెట్టడంతో రైతుల్లో ఆక్రోశం పెల్లుబుకింది. మహిళలు ఆధార్ కార్డు చేత పట్టుకొని గంటల తరబడి దుకాణాల వద్ద పడికాపులు కాశారు. ఒక దశలో పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. బారులు తీరిన రైతులను అదుపు చేయడానికి పోలీసులు ఇబ్బంది ప‌డ్డారు. శ్రీనివాస ఫర్టిలైజర్ షాప్ వద్ద తోపులాట జ‌ర‌గ‌డంతో పోలీసులు లాఠీలు ఝుళిపించి అదుపులోకి తెచ్చారు. నాలుగైదు రోజుల్లో తొలకరి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం ఇవ్వడంతో మృగశిరకు ముందే విత్తనాలు నాటేందుకు రైతులు ఉరుకుల పరుగులతో దుకాణాల వద్ద మండుటెండ‌ల్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది.

ఇప్పటికే 8 లక్షల పత్తి విత్తనాల సంచులు రెడీ..
రైతుల డిమాండ్ కు అనుగుణంగా 55 రకాల వివిధ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఒకే రకం విత్తనాలు కావాలని రైతులు పట్టు పట్టడం సమంజసం కాదని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లక్షల ఆరువేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారని, ఇందుకు అవసరమయ్యే 11 లక్షల విత్తన బ్యాగులను సకాలంలో అందిస్తామని తెలిపారు. మార్కెట్లో ఈసారి రాసి 659 రకం విత్తనాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికే 47 వేల సంచులు డీలర్ల వద్దకు సరఫరా చేశామని అన్నారు. రెండు మూడు రోజుల్లో మరో 25 వేల బ్యాగులు రానున్నాయని తెలిపారు.

లాఠీ చార్జ్ అవాస్తవం.. డీఎస్పీ జీవన్ రెడ్డి
పత్తి రైతులపై లాఠీ ఛార్జ్ చేశారని మీడియాలో వస్తున్న వార్తలను ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఖండించారు. రైతులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సంయ‌మనంతో వ్యవహరించారని, రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement