జన్నారం, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లాలో మంచి ఫలితాలు సాధించినందుకు మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. జిల్లాలో మంచి ఫలితాలు, దీనికి తోడు పాఠశాలలోని ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటూ పలు రంగాల్లో రాణిస్తున్నారు.
ఈనెల 23న హైదరాబాదులోని హైటెక్ సిటీలో డైరెక్టర్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వి.నరసింహారెడ్డి చేతుల మీదుగా జిల్లా స్థాయి ఉత్తమ అవార్డును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న అందుకోనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్నకు ఫోన్ చేసి తెలిపారు.
దీంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, మండల విద్యాధికారి ఎన్.విజయకుమార్, జిల్లా సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణ మూర్తి, శ్రీనివాస్ రావు, మధుబాబు, రాజకుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్పర్సన్ మంగ, పలువురు గ్రామస్తులు అభినందించారు.
ఆ పాఠశాల హెచ్.ఎం రాజన్న మాట్లాడుతూ… జిల్లాస్థాయిలో తమ పాఠశాల ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడం సంతోషకరమన్నారు.మరింత కృషితో విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడతానని ఆయన తెలిపారు. మునుముందు తమ పాఠశాల విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణతలోను, క్రీడల్లోనూ, ఇతర అన్ని రంగాల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవడానికి తనతో పాటు ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.