ఖానాపూర్, (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై శుక్రవారం అవిశ్వాసం ఉండగా.. హైకోర్టు ఉత్తర్వులతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస బలనిరూపణ ప్రక్రియ నిలిచిపోయింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ లపై 9 మంది కౌన్సిలర్లు, పార్టీలకు అతీతంగా అభ్యర్థులు కలిసి గత ఆరు మాసాల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డిని కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వినతిపత్రం అందజేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత నెల 14న ఆర్డీవో ఆర్ రత్నకళ్యాణి ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. జనవరి 5న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు సదరు కౌన్సిలర్లకు నోటీసులు ఇస్తూ ప్రొసీడింగ్ అధికారి, ఆర్డీవో రత్న కళ్యాణి వెల్లడించారు. శుక్రవారం రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం ఉండగా ప్రొసీడింగ్ అధికారి, ఆర్డీవో ఆర్.రత్న కళ్యాణి, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేంద్ర, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిన్నం సత్యనారాయణ సదరు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.
మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రొసీడింగ్ అధికారి, ఆర్డీవో రత్న కళ్యాణి హైకోర్టు ఉత్తర్వులు ఆధారంగా తాత్కాలికంగా అవిశ్వాసం నిలిపివేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో అవిశ్వాస బలనిరూపణకు వచ్చిన కౌన్సిలర్లు కంగు తిన్నారు. ఆర్డీవో కారులో వెళ్లిపోవడానికి ప్రయత్నం చేయగా సదరు కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. అవిశ్వాసం నిలిచిపోవడానికి కారణం ఏంటి అని, కోర్టు ఉత్తర్వులు వచ్చినట్లు ఒక రోజు ముందు ఎందుకు తెలుపలేదని వారు ప్రశ్నించారు. అవిశ్వాసానికి అధికారుల తప్పిదం ఉంది అని అన్నారు.