ఆసిఫాబాద్ రూరల్, జూన్ 22 (ప్రభ న్యూస్) : బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు వస్తున్నాయని ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొక్కిరల విశ్వప్రసాద్ రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అధిష్టానం అదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలు దగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తొమ్మిది సంవత్సరాల కుటుంబ పాలనలో రాష్ట్రం కుంటు పడిందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఫీజు రియంబర్స్ మెంట్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, పోడు భూముల పట్టాలు, రైతు రుణ మాఫీ, 12 శాతం గిరిజనులకు ముస్లీంలకు రిజర్వేషన్లు ఏమైనయని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్ పాలనను గమనిస్తూన్నారని, రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మర్శుకొల సరస్వతి, స్పోక్స్ పర్సన్ చునార్కర్ వశాంత్ రావు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షురాలు కళావతి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అసిఫ్, నాయకులు మసదే చరణ్ మురళి రాథోడ్ శేషు రావు, జిల్లాలోని మండల, గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.