Saturday, November 23, 2024

కాసిపేటలో పెరుగుతున్న కరోనా‌ కేసులు..

కాసిపేట : మండలంలో కరోనా రెండవ వేవ్‌ విజృంభిస్తోంది. మండల కేంద్రంలో వృద్ద మహిలకి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతొ స్థానికంగా ఆందోళన చెందుతున్నారు. ఆ వాడలో కంచె ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన 69 మందికి వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 30 పాజిటివ్‌ కేసులు, 57 మందిలో 22 మంది కరోనా బారినపడినట్టు వైధ్య పరీక్షల్లో నిర్దారణ కావడం చర్చనీయాంశం అయింది. రేగులగూడెం గ్రామంలోని ఒకే బందు వర్గానికి చెందిన 13 మంది, పల్లంగూడ, మల్కెపెల్లి, గుండ్లపాడ్‌ తదితర గ్రామాలలో కేసులు వెలుగు చూడగా మండల వ్యాప్తంగా ఇంకా కేసులు ఉన్నట్టు ప్రచారంలో వుంది. ఇంతకు ముందు కరోనా పాజిటివ్‌ నమోదు కాగానే రోగి ఇంటికి వెళ్ళి ఎఎస్‌ఎం, వైద్య సిబ్బంది మందులు ఇవ్వడం, రోజు రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, ఇంట్లో నుండి ఎవరిని బైటకు వెళ్ళకుండా కట్టడి చేయడం తదితర చర్యల ద్వారా వాడలోని, పక్క వారు జాగ్రత్తలు పడే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేక పోవడం, ఎవరికి వారే సొంత జాగ్రత్తలుతీసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని, అనుమానం వున్న వారు ఆసుపత్రిలో నిర్దారణ పరీక్షలు చేసుకోవాలనే ఆదేశాలతో పాజిటివ్‌ రోగులు వాటిని పరిగణలోకి తీసుకోకుండా విచ్చలవిడిగా బయట తిరుగుతుండడంతో కరోనా సులభంగా వ్యాప్తి చెందుతోంది. ఏమైనా మొదటి కరోనా వేవ్‌ నేపధ్యంలో అధికారులు, స్వఛ్చంద సంస్థలు చేపట్టిన కట్టడి చర్యలు, ప్రచార ఆర్భాటాలు కనిపించక పోవడంతో కరోనా సైతం చాపకింద నీరులా మారుమూల గ్రామాలకు విస్తరిస్తోంది.
గ్రామాల్లో చురుకుగా కరోనా నివారణ చర్యలు..
కరోనా నివారణ చర్యలు గ్రామాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయలతో పాటు గ్రామాల్లో స్థానిక సంస్థలు పారిశుద్ధ్యం పనులు నిత్యం చేపడుతున్నారు. సోడియం హైక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ప్రై చేస్తున్నారు. మరో వైపు పోలీసులు మాస్క్‌ ధరించడం పట్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు అతిక్రమించిన వారి నుండి అపరాద రుసుము వసూలు చేస్తున్నారు. రాబోయే రోజులు చాలా కీలకమైనవని, కరోనాను ఖతం చేయాలనే లక్షంతో అధికారుల సూచనలు పాటిస్తూ, ఆయా వ్యవస్థలకు ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement