Tuesday, November 19, 2024

Jannaram – కబ్జా లో చెరువు – మత్స్యకారుల ధర్నా

జన్నారం, జూన్ 23( ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ కబ్జాకుగురైన ఊర చెరువు వద్ద మండలంలోని చర్లపల్లి మత్స్యకారులు ఆదివారం ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. చెరువునుకబ్జాచేసి పోసిన మట్టిని వెంటనే తొలగించాలని నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తున్నారు.

మండలంలోని కిష్టాపూర్ ఊర చెరువు 30ఎకరాల 30గుంటల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద మండలంలోని కిష్టాపూర్,చర్లపల్లి, కొత్తూరుపల్లి, మన్నెగూడ రైతుల 1000 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి.ఈ చెరువుపై చర్లపల్లికి చెందిన 80 కుటుంబాల మత్స్యకారులు ఆధారపడి చేప పిల్లల పోసి, పెంచి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.

గత కొంతకాలంగా అదే గ్రామాలకు చెందిన కొంతమంది చెరువు శిఖం భూమిని కబ్జా చేసుకుంటూ పట్టాలు చేసుకున్నారు. ఆ కబ్జాదారులు ప్రస్తుతం ఆ భూమిలో మట్టిపోసి పొలం బంటాలు తయారు చేసుకున్నారు.

ఇటీవల ఈ విషయాన్ని తెలుసుకున్న మత్స్యకారులు అడ్డుకొని తాహసిల్దార్ కు, జిల్లా కలెక్టర్ కు,ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయం నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈ ఈ వెంకటేశం, జేఈ రాజు, వర్క్ ఇన్స్పెక్టర్ మామిడి శంకరయ్య, మండల సర్వేయర్ సురేష్ తదితరులు అక్కడికి వెళ్లి సర్వే చేయడానికి ఉపక్రమించారు.

- Advertisement -

అక్కడికి చేరుకున్న మత్స్యకారులంతా ప్రస్తుతం కబ్జా చేసి బంటాల్లో పోసుకున్న మట్టిని తొలగించాకే సర్వే చేయాలని భీష్మించుకు కూర్చున్నారు. చేసేదేమీ లేక నీటిపారుదల శాఖాధికారులు, సర్వేయర్ సోమవారం సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని వాయిదా వేశారు. అయినప్పటికీ గ్రామ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు తోకల నర్సయ్య , భీమ రాజ్యం, శ్రీనివాస్ , చిరంజీవి, లింగన్న, లచ్చవ్వ, పోచవ్వ, తదితరులు అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement