- రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి
జన్నారం, (ఆంధ్రప్రభ): దైవభక్తితో సంప్రదాయ పద్ధతిలో జాతరలు నిర్వహించుకోవడం ఎంతో ముఖ్యమని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గ్రామ సమీపంలోని వీర్లగుట్టపై ఉన్న శ్రీ కేతేశ్వర, కంకాలమ్మ, శివాలయం ఆవరణలో మహేంద్రుల ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఆదివారం ఎంతో ఘనంగా జాతర నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏటా జాతర నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. జాతరను పురస్కరించుకొని పలు జిల్లాల్లోని మహేంద్రులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఇంటిల్లిపాటికి శివాలయంలోని శివమూర్తిని, ఇతర దేవతమూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు.
ఈ దేవాలయం ముందు ముందు భక్తుల ఆదరణ పొంది,ఎంతో అభివృద్ధి చెంది, ఘనంగా జాతర జరిగేలాగా చూడాలని ఆయన కోరారు. తమ వంతు సహకారం ఆలయ కమిటికి తప్పకుండా ఉంటుందని ఆయన చెప్పారు.
ముందుగా కాంగ్రెస్ సీనియర్ నేత, హరిహర భారత్ గ్యాస్ యజమాని మిక్కిలినేని రాజశేఖర్ దంపతులు శ్రీకేతేశ్వర, కంకాలమ్మ, శివునికి, ఇతర దేవత మూర్తులకు ఎంతో భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించి, పూజలు చేశారు. మహేంద్ర సంఘం ఆలయ కమిటి కోశాధికారి కోడిజుట్టు సత్యవ్వ, రాజన్న దంపతులు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ,మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్, మాజీ సర్పంచి జక్కు భూమేష్ గుప్తా, ఆలయ కమిటి పూజారి భూమన్న స్వామి, ఆలయ కమిటి చైర్మన్ ఎం.ఆర్ నర్సింగరావు, గౌరవ అధ్యక్షుడు చిలివేరి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి కోడిజుట్టు రాజన్న, కోశాధికారి పిల్లి మల్లయ్య, నేతలు కొండయ్య ,కనకయ్య,సంద గోపాల్,శంకర్, సుధీర్ కుమార్, అరుణ్ కుమార్ ,కృష్ణ, నరేష్, తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ ఆధ్వర్యంలో స్థానిక ఎ.ఎస్.ఐ సురేష్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.