Monday, November 18, 2024

ADB: అంతర్ జిల్లా దొంగ అరెస్టు… వృద్ధురాలు రూ.10వేలు రికవరీ…

జన్నారం, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఆవరణలో ఓ వృద్ధురాలు బ్యాంకు నుంచి డ్రా చేసిన రూ.10వేలను సినీ ఫక్కీలో దొంగలించిన అంతర్ జిల్లా దొంగను పోలీసులు పట్టుకొని ఆ డబ్బులు రికవరీ చేసి జైలుకు తరలించారు.

మండలంలోని చింతలపల్లికి వాసి 65 ఏళ్ల వృద్ధురాలైన ముదేళ్ల భూమక్క ఈనెల 24న ఉదయం 11 గంటలకు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు వచ్చి రూ.10వేలు నగదు డ్రా చేసుకున్న విషయాన్ని గమనించిన అంతర్ జిల్లా దొంగ ఖమ్మం జిల్లా మధిర మండలవాసి ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో నివాసముంటున్న కంభంపాటి ఎసోబు అలియాస్ అందుగుల సురేష్ రెడ్డి సినీ ఫక్కీలో ఆ వృద్ధురాలుకు మాయమాటలు చెప్పి నీళ్లు తాగించి అదనంగా ఇంకో రూ.4వేలు వస్తాయని నమ్మబలికి ఆశపడ్డ ఆమె నుంచి రూ.10వేల నగదును కాజేసి ఫరారయ్యాడు.

- Advertisement -

ఈ వ్యవహారం అంతా ఆ బ్యాంకులోని సీసీ కెమెరాలో రికార్డు కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి 24గంటల్లోనే ఆ దొంగను గుర్తించి అరెస్ట్ చేసి రూ.10వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ వృద్ధురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆ దొంగను లక్షేట్టిపేట జైలుకు తరలించినట్లు స్థానిక అదనపు ఎస్సై రాథోడ్ తానాజి గురువారం తెలిపారు.

స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బుక్య తూకరాం, కానిస్టేబుల్ కొత్తూరు భాస్కర్ లు ఛాలెంజుగా తీసుకొని సీసీ కెమెరాలో పడ్డ నిందితుని ఛాయా చిత్రం ఆధారంగా 24 గంటలు గడవక ముందే పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్ళను మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, లక్షేట్టిపేట సి.ఐ అల్లం నరేందర్, ఆ బ్యాంకు మేనేజర్ మహేష్, ప్రజలు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement