Saturday, November 23, 2024

ABD | ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోల్‌మాల్.. ఘటనపై విచారణ

జన్నారం, (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా పొనకల్ సింగిల్ విండో సొసైటీలో వడ్లమ్మిన రైతుల రూ.12 లక్షల గోల్ మాల్ వ్యవహారంపై మంచిర్యాల డీసీఓ కార్యాలయ సీనియర్ ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు గురువారం విచారణ చేపట్టారు. రైతులను, సొసైటీ కార్యదర్శి రాజన్నను, బాదంపల్లి సింగిల్ విండో కొనుగోలు కేంద్ర ఇంచార్జి గండోరి రవిని వేర్వేరుగా విచారించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. మండలంలోని పొనకల్ సింగిల్ విండో సొసైటీ పరిధిలోని బాదంపల్లి గ్రామంలోని యాసంగిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 15 మంది రైతులు రూ.12 లక్షల విలువైన వడ్లను విక్రయించారు. కేంద్రం ఇన్‌చార్జి రవి విక్రయించిన ధాన్యాన్ని ఇతర రైతుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి కాజేశాడు.

బాధిత రైతుల సొమ్మును అనుకూలమైన వారి ఖాతాలోకి జమ చేసినట్లు కార్యదర్శికి అగ్రిమెంట్ పత్రం రాశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు కమలాకర్, భూమన్న, నాయకులు దాసరి తిరుపతి, ఆనందయ్య, కొండపల్లి మహేష్, జనార్దన్, మనోహర్ రావు తదితరులు సోమవారం నాడు కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.

కాగా, దీనిపై మంచిర్యాల ఇన్‌చార్జి డీసీఓ రామ్మోహన్ విచారణకు ఆదేశించారు. అందులో భాగంగానే నేడు (గురువారం) ఈ వ్యవహారంపై విచారణ చేప‌ట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమ డబ్బులు వెంటనే ఇప్పించాలని కోరారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement