Tuesday, October 29, 2024

ADB: ముధోల్ లో భారీ వర్ష భీభత్సం..

మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
బ్రిడ్జిలపై నుండి వరద ఉధృతి
జలమయమైన రహదారులు
జలదిగ్బంధనంలో సాయిమాధవ్ నగర్ కాలనీ
డ్రైనేజీలు లేక చెరువును తలపించిన మండల కేంద్రం

ముధోల్, సెప్టెంబర్ 4 (ప్రభన్యూస్) : ముధోల్ మండలంలో మంగళవారం ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. వర్షానికి ముధోల్ లోని ఖజానా చెరువు నిండడంతో వరద భారీగా కొనసాగడంతో బస్టాండ్ ప్రాంతం నుండి వివేకానంద చౌక్ వరకు దారి జలమయమైనది. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రధాన దారి నదిని తలపించింది.

సాయిమాధవ్ నగర్ కాలనీలో మహాత్మా జ్యోతిబాపులే చుట్టూ నీరు చేరాయి. ముధోల్ మండల కేంద్రం నుండి లోకేశ్వరం మండలానికి వెళ్లే దారిలో వడ్తాల్ గ్రామ సమీపంలో బ్రిడ్జి పై నుండి వరద నీటి ఉధృతి ఎక్కువగా కొనసాగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జికి ఇరువైపులా కోతకు గురైనది. దీంతో అబ్దుల్లాపూర్ తో పాటు లోకేశ్వరం మండలానికి వెళ్లే అన్ని గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అటుగా వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వంతెన లోతట్టు ప్రాంతంలో ఉన్నందున ప్రతిసారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని గ్రామస్థులు వాపోయారు. అధికారులు స్పందించి నూతన వంతెన నిర్మించాలని కోరారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు నిండడంతో పాటు, సోయా, పత్తి, పంట చేనులు నీట మునిగాయి.

- Advertisement -

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను సూచిస్తున్నారు. ముధోల్ సిఐ మల్లేష్ ఆధ్వర్యంలో ఎస్.ఐ సాయికిరణ్ తమ సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement