బైంసా : సివిల్ సప్లయ్ హమాలీ ఒకరు వడదెబ్బ బారిన పడి మృతి చెందిన ఘటన బైంసా మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. భైంసాలోని ఎంఎల్ఎస్ పాయింట్ లో గత మూడు దశాబ్దాల కాలంగా హమాలీగా పని చేస్తున్న షేక్ ఆస్లామ్(50) గురువారం ఉదయం మిర్జాపూర్ లో రేషన్ బియ్యాన్ని దించేందుకు గాను తోటి కూలీలతో కలిసి వెళ్లాడు. అక్కడి రేషన్ షాపులో లారీ నుంచి బియ్యం సంచులను దించుతూ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. తోటి కూలీలు షేక్ అస్లామ్ కు సపర్యలు చేసి వైద్య సేవల నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందాడు. భైంసా రూరల్ పోలీసులు ఘటన స్థలిలో మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు కుభీర్ మండలంలోని లింగి గ్రామానికి చెందిన వ్యక్తి. మృతునికి ముగ్గురు కుమార్తెలతో పాటు ఇద్దరు కుమారులున్నారు. అప్పటి వరకు తమతో కలిసి బియ్యం సంచులను దించుతున్న షేక్ అస్లామ్ కళ్లెదుటే మృతి చెందడంతో సివిల్ సప్లయ్ కూలీలు తీరని అవేదనకు లోనయ్యారు. మృతదేహం వద్ద బోరున విలపించారు.