ఢిల్లీ నుండి కంటైనర్ లో కర్ణాటక కు రవాణా…
రూ.16 లక్షల విలువైన గుట్కా బ్యాగుల పట్టివేత…
పోలీసుల అదుపులో రాకెట్ సూత్రధారులు..
ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గుట్కా, పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించినా అక్రమ వ్యాపారం అడ్డూ అదుపు లేకుండా జోరుగా సాగుతూనే ఉంది. ఢిల్లీ నుండి కర్ణాటక వరకు జాతీయ రహదారిపై నిషేధిత మాదక ద్రవ్యాలతో పాటు గుట్కా సరుకు రవాణా హద్దులు దాటి జోరుగా సాగుతోంది.
ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ అలం, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గుట్కా నిల్వలపై ఉక్కుపాదం మోపగా.. 4లారీల నిండా సరిపడే రూ.2 కోట్ల 10లక్షల విలువైన గుట్కా సంచులను స్వాధీనం చేసుకొని 40మందిపై కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు మహారాష్ట్రలో నిషేధిత గుట్కా వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. సర్కారు వీటిపై నిషేధం విధించడంతో నల్ల బజార్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పడి వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది.
తాజాగా రూ.16 లక్షల విలువైన గుట్కా నిల్వల గుట్టురట్టు…
ఢిల్లీ నుండి ఆదిలాబాద్ జాతీయ రహదారి 44 మీదుగా కర్ణాటక వెళ్తున్న నిషేధ గుట్కా, పొగాకు ఉత్పత్తులను పోలీసులు సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కంటైనర్ లో 35సంచులు నిల్వ ఉన్న సరుకులను డీఎస్పీ జీవన్ రెడ్డి, మావల ఎస్సై విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. వీటిలో రూ.16 లక్షల విలువైన గుట్కా సంచులు పట్టుబడ్డాయని డీఎస్పీ జీవన్ రెడ్డి ఆంధ్ర ప్రభకు వివరించారు. ముగ్గురు సూత్రధారులు అదుపులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీటితో ప్రమేయం ఉన్న వ్యాపారులు మహ్మద్ అజీమ్, మహమ్మద్ తారీఫ్, అస్లాం ట్రేడర్స్ యజమాని శమ్ముపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. కాగా ఇప్పటివరకు రెండు నెలల్లోనే రూ.2.5 కోట్ల విలువైన గుట్కా సంచులు స్వాధీన పరుచుకున్నామని డీఎస్పీ వివరించారు.