Tuesday, November 26, 2024

Boath: పార్టీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్న ప్రభుత్వం : శ్రీనివాస్

బోథ్, జూన్ 22, ప్రభ న్యూస్ : తెలంగాణ శతాబ్ది ఉత్సవాల పేరిట అధికారంలో ఉన్నామనే అహంతో ప్రజాధనాన్ని పార్టీ ప్రచారానికి, తమ కార్యకర్తలకు విందు వినోదాల కోసం వృధా చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి గోమాసా శ్రీనివాస్ ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాలలో కేవలం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తప్ప ఇతర పార్టీల నాయకులు ఎవరు కనిపించకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. ముందుగా స్థానిక బస్టాండ్ లో దశాబ్దికాలంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నందుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. దళితులకు మూడు ఎకరాల భూమి, రెండు పడకల ఇళ్ళు నిర్మాణం, గిరిజనులకు మైనారిటీలకు 12% రిజర్వేషన్లు, ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పోడు హక్కులు, ఇలా అనేక హామీలు ఇచ్చి నేటి వరకు అమలు చేయలేదని విమర్శించారు.

అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయకపోగా, కనీసం వారి కుటుంబాలను కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలను వచించిన కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, రాబోవు ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తెలంగాణ వచ్చినప్పుడు 72వేల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నేడు అయిదు లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్పలో కూరుకుయిందని, పొరపాటున మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వస్తే రాష్ట్రాన్ని అమ్మేసినా ఆశ్చర్యం లేదని విమర్శించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్ద దించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వన్నెల అశోక్, నరేష్ జాదవ్, ఆడే గజేందర్, చంటి పసుల, కుర్మే మహేందర్, సల్ల రవి, కోటేశ్వర్, వసంత్, మల్లారెడ్డి, మల్లెపూల సత్యనారాయణ, మహిమద్ ఖాన్, ప్రపూల్ చందర్, అన్ని మండలాల అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement