Friday, November 22, 2024

పీఆర్ సీ కోసం వినతి పత్రం..

బెల్లంపల్లి : మున్సిపాలిటీలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులుగా పనిచేస్తున్న వారందరికి 11వ పీఆర్‌సీని వర్తింపజేయాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య సంక్షోభం వచ్చిప్పుడు ముందువరుసలో నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మున్సిపల్‌ ఉద్యోగ కార్మికులు సేవలందిస్తున్నారని, అతి తక్కువ వేతనాలను ఇస్తున్నా ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తామని, అయినా మా శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను, హోంగార్డులను, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లను, డైలీవేజ్‌ వర్క్‌ చార్టడ్‌ ఉద్యోగులను 11వ పీఆర్‌సీ పరిధిలోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులను విస్మరించిందని అన్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఫిక్స్‌డ్‌ పే, మల్టీ పర్పస్‌ వర్కర్లకు కూడా పీఆర్‌సీని వర్తింప చేస్తామని స్పష్టత ఇవ్వలేదని, 8వ పీఆర్‌సీ నుండి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఆయా పీఆర్‌సీలో ఇచ్చిన మినిమం బేసిక్‌ పే కనీస వేతనంగా చెల్లిస్తున్నారని అన్నారు. అలాంటి హక్కును పొందుతున్న మున్సిపల్‌ కార్మికులకు అన్యాయం చేయడం సబబు కాదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం పునరాలోచించి మున్సిపాలిటీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల వారికి కూడా పీఆర్‌సీ వర్తింపజేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ కార్మికులకు రూ.24వేలు వేతనంగా ఇవ్వాలని, కేటగిరిలవారీగా వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో
మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎస్‌.కె.యాకుబ్‌, జిల్లా కార్యదర్శి గొడిసెల చంద్రమొగిలి, నాయకులు ఈర్ల రాజమౌళి, బొల్ల లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement