Thursday, November 21, 2024

ఏరియా గనుల్లో 62 శాతం ఉత్పత్తి..

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఉపరితల, భూగర్భ గనుల్లో ఏప్రిల్‌ మాసానికి 62 శాతం ఉత్పత్తి సాధించామని ఏరియా జీఎం ఎం.సురేష్‌ పేర్కొన్నారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ నెలలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 53,2800 టన్నులు కాగా 33,233 టన్నులు సాధించినట్లు తెలిపారు. ఏరియాలోని ఆర్కే-6 గనిలో 107 శాతం, ఎస్‌ఆర్‌పి-3, 3ఏ గనిలో 101 శాతం, ఎస్‌ఆర్‌పి-1 గనిలో 106 శాతం, ఇందారం గనిలో 100 శాతం సాధించినట్లు తెలిపారు. శ్రీరాంపూర్‌ ఉపరితల గనిలో 2.88లక్షల టన్నులకు 1,29,839 టన్నులతో 45 శాతం, ఇందారం ఉపరితల గనిలో 96వేల టన్నులకు గాను 62,385 టన్నులతో 65 శాతం సాధించామని తెలిపారు. కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ కారణంగా ఉద్యోగుల గైర్హాజరు ప్రభావం, శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్టు ప్రాజెక్ట్‌ ఓబీ పనులు మరో కంపెనీకి అప్పగించడం వల్ల కాస్త జాప్యం జరిగిందని అన్నారు. మే నెలలో ఉత్పత్తిని సాధించేందుకు అన్నివిధాలుగా పని స్థలాలను మెరుగుపరుస్తున్నామని, ఓపెన్‌కాస్టుల్లో ఎండవేడిమి తట్టుకొని కార్మికులు పనులు చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ-2 జీఎం కెహెచ్‌ఎన్‌ గుప్త, డీజీఎం (పర్సనల్‌) గోవిందరాజు, ఐఈడీ డీజీఎం చిరంజీవులు, కిరణ్‌కుమార్‌, డీజీఎం సివిల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement