జన్నారం, (ప్రభ న్యూస్) : మోటర్ బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు మంచిర్యాల డిసిపి ఎగ్గిడి భాస్కర్ తెలిపారు. గత కొంత కాలంగా జల్సాలకు అలవాటు పడ్డ జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముట్టపల్లి పవన్, మెట్ పల్లి గ్రామానికి చెందిన బోడ్డు అరుణ్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ కు చెందిన కోట వినయ్, కామన్ పల్లికి చెందిన వేముల ప్రవీణ్ లు రాష్ర్టంలోని హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్, జన్నారం, ఇతర ప్రాంతాలలో తిరుగుతూ విలువైన మోటర్ సైకిళ్లను దొంగలించుకుని తక్కువ ధరకు ఇతరులకు అమ్ముతున్నారని ఆయన చెప్పారు.
మండలంలోని కలమడుగు గోదావరి వంతెన వద్ద బుధవారం ఆ నలుగురు నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని విచారించగా వాహనాల పత్రాలు లేని కారణంగా వారిన లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్, స్థానిక ఎస్‌ఐ గుండేటి రాజవర్ధన్, హెడ్ కానిస్టేబుళ్లు బి.తుకారాం, ఎండీ గౌస్, కానిస్టేబుళ్లు కొత్తూరి భాస్కర్, బి.సురేష్, లక్కాకుల వెంకటేష్, ఎ.రవీందర్ లు పట్టుకున్నారని ఆయన తెలిపారు.
నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి 15 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది, నిజామాబాద్‌కు చెందిన మూడు, ఆర్మూర్‌కు చెందిన రెండు, జన్నారంలో ఒకటి పట్టుకున్నామని, ఆ వాహనాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్, పల్సర్ మోటార్‌సైకిళ్లకు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌లను డీసీపీ అభినందించారు. రివార్డు కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.