బోథ్, జులై 20, ప్రభ న్యూస్ : ఆదిలాబాద్ జిల్లాలో పురాతన తాలుక కేంద్రమైన బోథ్ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రెవిన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అయితే బోథ్ తాలూకా వాసులు గొంతెత్తి మాకు రెవిన్యూ డివిజన్ కావాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన పలువులు వార్డు మెంబర్లు రాజీనామాలు చేశారు.
కట్ట శిరీష, మెరుగు లక్ష్మి అను వార్డు మెంబర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నది ప్రజల సమస్యలను పరిష్కరించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని, కానీ బోథ్ వాసుల చిరకాల వాంఛ అయిన రెవెన్యూ డివిజన్ సాధనను పట్టించుకోకపోవడం సరికాదని, అందుకు నిరసనగా రాజీనామాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బోథ్ ను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని త్వరలో మరికొందరు ప్రజా ప్రతినిధులు రాజీనామా బాటలో పయనించనున్నారు.