Tuesday, July 9, 2024

ADB: ఎట్టకేలకు రైతులకు సొసైటీ కార్యదర్శి చెక్కుల అందజేత…

20న డబ్బులు డ్రా చేసుకునే వీలు
వడ్లమ్మిన రైతుల రూ.12 లక్షల గోల్ మాల్
సెంటర్ ఇన్చార్జి రవి పై కేసు
జన్నారం, జులై 5( ప్రభ న్యూస్): ఎట్టకేలకు బాధిత రైతులకు సొసైటీ కార్యదర్శి సంతకం చేసి ఈనెల 20న డబ్బులు డ్రా చేసుకునేలాగా చెక్కులను అందజేశారు. వడ్లమ్మిన 14 మంది రైతులకు రూ.11 లక్షల85 వేలు విచారణలో తేలగా, బాధ్యత గల సొసైటీ కార్యదర్శి సంతకాలు చేసి బాధిత రైతులకు అందజేసిన సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో జరిగింది. మండలంలోని పొనకల్ సింగిల్ విండో సొసైటీలో వడ్లమ్మిన రైతుల రూ.12 లక్షల గోల్ మాల్ వ్యవహారంలో మంచిర్యాల డీసీఓ కార్యాలయ సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు విచారణ చేశారు. అటు రైతులతోనూ, ఇటు సొసైటీ కార్యదర్శి రాజన్నతోనూ, బాదంపల్లి కేంద్ర ఇన్చార్జి గందోరి రవిని వేరువేరుగా విచారించారు.

మండలంలోని పొనకల్ సింగిల్ విండో సొసైటీ పరిధిలోని బాదంపల్లి గ్రామంలో యాసంగిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 14 మంది రైతులు రూ.12 లక్షల వడ్లను విక్రయించారు. విక్రయించిన వడ్ల డబ్బులను ఇతర రైతుల బ్యాంకు ఖాతాలోకి సెంటర్ ఇంచార్జి రవి మార్చి కాజేశాడని తేలింది. అధికారి విచారణ అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మిక్కిలినేని రాజశేఖర్ ప్రత్యేక చొరవతో, ఆ సొసైటీ చైర్మన్ అల్లం రవి, కొంతమంది డైరెక్టర్లు శ్రద్ధ తీసుకొని అటు రైతులతోనూ, సెంటర్ ఇన్చార్జి రవి, కార్యదర్శి రాజన్న తోను సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చారు. రైతులు నష్టపోవద్దని సదుద్దేశంతో ముందుగా సెంటర్ ఇన్చార్జి రవి రూ.11లక్షల 85 వేలు రైతులకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

రవి ప్రైవేట్ ఎంప్లాయ్ అయినందున రవి చెక్కులను పాలకవర్గం రాయించుకొని కార్యాలయంలో భద్రపరిచారు. ఆ వెంటనే ప్రభుత్వ ఉద్యోగి అయిన సొసైటీ కార్యదర్శి కావటి రాజన్న 14 మంది రైతులకు ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ చెక్కులపై డబ్బులు రాసి ఈనెల 20న డ్రా చేసుకోవడానికి వీలుగా సంతకం చేసి ఇచ్చారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ సెంట్రల్ ఇన్చార్జి చెడు వ్యసనాలకు అలవాటు, దురుద్దేశంతో రైతుల డబ్బులను కాజేస్తాడని బట్టబయలైంది. ఈ వ్యవహారంలో 5 రోజుల క్రితం బాధిత రైతులు మోటపలుకుల కమలాకర్, ఆరవ్వ, భూమన్న, నేతలు దాసరి తిరుపతి, ఆనందం, కొండపల్లి మహేష్, ఎస్.జనార్ధన్, కె.మనోహర్ రావు తదితరులు ఆ సొసైటీ ఆఫీసుకు తాళంవేసి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల ఇన్చార్జి డీసీఓ రామ్మోహన్ విచారణకు ఆదేశించారు. అందులో భాగంగానే డీసీఓ కార్యాలయ సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు విచారణ నిర్వహించారు.

- Advertisement -


బాదంపల్లి సెంటర్ ఇన్చార్జి రవి పై కేసు నమోదు…
పొనకల్ సొసైటీ పరిధిలోని బాదంపల్లి కొనుగోలు కేంద్రంలో వడ్లమ్మిన రైతుల డబ్బులను గోల్ మాల్ చేసి ఇతరుల ఖాతాలోకి మార్చి వాడుకున్నానే అభియోగం మేరకు ఆ సెంటర్ ఇన్చార్జి చింతలపల్లి వాసి గందోరి రవిపై సొసైటీ చైర్మన్ అల్లం రవి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement